Irrigation in Telangana: నీటిపారుదల శాఖ పద్దుపై సోమవారం చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో పద్దుకు సంబంధించిన విధాన పత్రం, ఫలితాల బడ్జెట్‌పై నీటిపారుదల శాఖ నివేదిక రూపొందించింది. రాష్ట్రంలో 2021 డిసెంబర్ నాటికి సాగునీటి విస్తీర్ణం 74.32 లక్షల ఎకరాలు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 16.45 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతో పాటు 31.50 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు ప్రభుత్వం తెలిపింది. రుణాలతో కలుపుకొని 2020 - 21లో నీటిపారుదల శాఖపై 19,508 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... 2021-22 డిసెంబర్ వరకు 19,468 కోట్లు ఖర్చు చేసింది. ఈ రెండేళ్లలో 3,47,417 ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించినట్లు ప్రభుత్వం తెలిపింది. దేవాదుల కింద 1,79,334... కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,16885 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చినట్లు పేర్కొంది.
రెండేళ్లలో 30 లక్షల ఎకరాలే లక్ష్యం
2022-23 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 22,637 కోట్ల రూపాయలను నీటిపారుదల శాఖకు కేటాయించింది. అందులో నిర్వహణా పద్దు 13,414 కోట్లు కాగా.. ప్రగతిపద్దు 9,223 కోట్లు. రానున్న రెండేళ్లకు సంబంధించిన లక్ష్యాలను ప్రభుత్వం తెలిపింది. రెండేళ్లలో 30 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొంది. 2022-23 లక్ష్యం 13.54 లక్షల ఎకరాలు కాగా... 2023-24 లక్ష్యం 14.97 లక్షల ఎకరాలు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 2022-23 లో 6.47 లక్షల ఎకరాలు, 2023-24 లో 2.72 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
కొత్త ఆయకట్టే లక్ష్యంగా..
సీతారామ ఎత్తిపోతల ద్వారా వచ్చే ఏడాది 3.28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకొంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా 2023-24లో 3.17 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు తెలిపింది. అదే ఏడాది ఇందిరమ్మ వరదకాల్వ ద్వారా 2.08 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2223 కోట్ల వ్యయంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తయ్యాయన్న ప్రభుత్వం... 805 కోట్ల వ్యయంతో చేపట్టిన నిజాంసాగర్ పునరుద్ధరణ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని పేర్కొంది. ఏఐబీపీ పథకం కింద 11 ప్రాజెక్టులకు కేంద్రం నుంచి డిసెంబర్ వరకు 4328 కోట్లు వచ్చాయన్న ప్రభుత్వం... మూడింటి పనులు పూర్తయినట్లు పేర్కొంది. 2022లో మరో మూడు ప్రాజెక్టులు, 2023లో మిగిలిన ఐదు ప్రాజెక్టులు పూర్తవవుతాయని తెలిపింది.
ఇదీ చదవండి: