రాష్ట్రంలో 16 ప్రజా సంఘాలపై విధించిన నిషేధాన్ని(ban) ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. హింసాత్మక చర్యలను ప్రేరేపిస్తూ నిషేధిత మావోయిస్టులతో(mavoist) సంబంధాలు కలిగి ఉన్నాయన్న ఆరోపణలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్(somesh kumar) జీవో నెంబర్ 73ను జారీ చేశారు. మార్చి 30 నుంచి 16 ప్రజా సంఘాలపై ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
16 ప్రజా సంఘాలు...
ఆ జాబితాలో తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఏకేఎస్), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (డీఎస్‌యూ), తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్), ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ (ఏఎస్‌యూ), కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ (సీఆర్‌పీపీ), తెలంగాణ రైతాంగ సమితి (టీఆర్‌ఎస్), తుడుం దెబ్బ (టీడీ), ప్రజాకళామండలి (పీకేఎం), తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (టీడీఎఫ్), ఫోరం ఎగ్నెస్ట్ హిందూ ఫాసిజం ఎఫెన్సివ్ (ఎఫ్‌ఏహెచ్‌ఎఫ్‌ఓ), సివిల్ లిబర్టీస్ కమిటీ (సీఎల్‌సీ), అమరుల బంధు మిత్రుల సంఘం (ఏబీఎంఎస్), చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్), విప్లవ రచయితల సంఘం (విరసం) ఉన్నాయి.
ఈ పార్టీలన్నీ మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. అంతేకాకుండా... తమ కార్యకర్తలను ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ఉసిగొల్పుతున్నాయని కూడా తెలిపింది. అందువల్లే వాటిని చట్టవిరుద్ధ సంఘాలుగా గుర్తించి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే బీమా- కోరెగావ్ కేసు, ఉపా చట్టం కింద అరెస్టయిన విరసం నేత వరవరరావు(varavararao), జీఎన్ సాయిబాబా, రోనా విల్సన్, తదితరులను విడుదల చేయాలని ఆ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి చట్ట వ్యతిరేక సంఘాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు ప్రకటించింది.
ప్రజా సంఘాల న్యాయపోరాటం
ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమపై నిషేధం విధించడం దుర్మార్గమని అప్పట్లో ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమరవీరుల బంధు మిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.పద్మకుమారి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం తనంత తానుగా 16 ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: REVANTH REDDY: 'ప్రజలు.. తెరాస నుంచి విముక్తి కోరుతున్నారు'