అటవీ హక్కుల చట్టం పేరుతో ఎస్టీలు, గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. 40 ఏళ్లకు పైగా అడవుల్లో పోడు భూములను సాగు చేస్తూ... గిరిజనులు జీవనం సాగిస్తున్నారని ఆయన తెలిపారు. గిరిజనుల హక్కుల సాధన కోసం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మక్దూం భవన్లో తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన ఒక రోజు నిరాహారదీక్షకు చాడ సంఘీభావం తెలిపారు.
2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు, సాగు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని చాడ డిమాండ్ చేశారు. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని.. ఎస్సీ, ఎస్టీలకు పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ పథకాలను అమలు చేయాలని కోరారు. తండాల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి.. రూ. 10 వేల కోట్ల బడ్జెట్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.