గుండెపోటు బాధితులకు సత్వర చికిత్స అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం నూతన కార్యాచరణకు రూపకల్పన చేస్తోంది. ‘స్టెమీ’ పేరిట జాతీయ ఆరోగ్య మిషన్ ప్రవేశపెట్టిన పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం అమలుపై ఉన్నతాధికారులు, గుండె వైద్య నిపుణులతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణా ఇటీవల సమీక్ష నిర్వహించారు.
గుండెపోటు వచ్చినప్పుడు బాధితులను అత్యవసరంగా సమీపంలోని పెద్దాసుపత్రికి తరలించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో గుండె సంబంధిత చికిత్సలు అందించే ఆసుపత్రులు అందుబాటులో లేక అధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. దీనిని పరిగణలోకి తీసుకుని గుండెపోటు బాధితులకు సత్వర వైద్యం అందించాలనే లక్ష్యంతో జాతీయ ఆరోగ్య మిషన్ ‘స్టెమీ’ పథకాన్ని తీసుకొచ్చింది.
అంబులెన్సులో స్టెమీ కిట్
108 అంబులెన్సులో ‘స్టెమీ’ కిట్‌ను అందుబాటులో ఉంచుతారు. సిబ్బంది ఈసీజీ పరికరంతో అంబులెన్స్‌లోనే బాధితుల పరిస్థితిని గుర్తించి మొబైల్ ఫోన్‌లో నిపుణులకు సమాచారం చేరవేస్తారు. అది గుండెపోటేనని వారు నిర్ధారిస్తే... సమస్య తీవ్రతను తగ్గించే ఔషధాలను తక్షణం అందిస్తారు. బాధితులను సమీపంలోని ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులకు తరలిస్తారు. గుండెపోటుకు సత్వర చికిత్స అందించేందుకు ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో జనరల్ ఫిజిషియన్లు, నర్సులకు అవసరమైన శిక్షణ ఇస్తారు.
రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎం ఇలా ఎంపిక చేసిన 11 కేంద్రాల్లో గుండె రక్తనాళాల్లో పూడికలు తొలగించే యాంజియోప్లాస్టీ చికిత్సలకు అవసరమైన అధునాతన క్యాథ్‌ల్యాబ్‌లను నెలకొల్పనున్నారు. ఈ కేంద్రాల్లో సాయంత్రం వేళల్లోనూ గుండె సంబంధిత వైద్య సేవలు అందించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద కార్డియాలజిస్టులను నియమిస్తారు.
ఇదీ చూడండి : రేషన్ పోర్టబిలిటీ విధానం విజయవంతం