పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం... అటవీ పునరుద్ధరణ చర్యలు సహా వివిధ ప్రణాళికల్ని అమలు చేస్తోంది. పట్టణప్రాంత పరిసరాల్లో ఉన్న ఆటవీ బ్లాకులను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేసే చర్యలను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 129 ప్రాంతాల్లో లక్షా 60 వేల ఎకరాల విస్తీర్ణంలో 188 అటవీ బ్లాకులు ఉన్నాయి. అందులో పట్టణప్రాంతాల సమీపంలో ఉన్న 95 పార్కుల పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టి అందులో 32 అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి చేశారు.
అర్బన్ ఫారెస్ట్ పార్కులకు విశేష స్పందన
మిగతా చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆయా అటవీ బ్లాకుల్లో ఆటవీ పునరుద్ధణ చర్యలు చేపట్టడంతో పాటు నేల-తేమ పరిరక్షణ చర్యలు, రూట్ స్టాక్ అభివృద్ధి, నేలల స్వభావానికి అనుగుణంగా మొక్కలు నాటడం, ఆహ్లాదాన్ని, నీడను ఇచ్చే మొక్కలు నాటడం, సందర్శకులకు సౌకర్యాలు, పిల్లలు ఆదుకునేందుకు ఏర్పాట్లు... తదితర పనులు చేస్తున్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అర్బన్ ఫారెస్ట్ పార్కులను మరింత బాగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖాలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేసి అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.
సీఎస్ సోమేష్ కుమార్ పరిశీలన
సీఎం ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు ఈ దిశగా కసరత్తు వేగవంతం చేశారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ వద్ద అభివృద్ధి చేసిన ఆక్సిజన్ అర్బన్ పార్కును సీఎస్ సోమేష్ కుమార్ స్వయంగా పరిశీలించారు. వివరాలు అన్నింటినీ తెలుసుకున్న ఆయన... రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మంగళవారం జరగనున్న కలెక్టర్ల సమావేశంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ అర్బన్ ఫారెస్ట్ పార్కుల అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
కంపా నిధుల కోసం సర్కారు ప్రయత్నం..
అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి కంపా నిధులను అదనంగా పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది 603 కోట్ల రూపాయల కంపా నిధులతో పనులకు స్టీరింగ్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి కోసం అదనపు నిధులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో 350 కోట్లతో, ఇతర పట్టణ ప్రాంతాల్లో నగర వన ఉద్యానయోజన కింద మరో 350 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 200 కోట్ల రూపాయలతో ఆటవీబ్లాకుల పునరుజ్జీవన చర్యల కోసం కంపా నిధులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చూడండి: ‘కొండపోచమ్మ’కు.. వడివడిగా గోదారి