ధరణి పోర్టల్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకున్న వారి రిజిస్ట్రేషన్లు అదే రోజు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్.. పోర్టల్‌ను సమర్థంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరికీ ఎలాంటి విచక్షణాధికారాలకు తావు లేకుండా పని చేయాలన్న ఆయన.. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోర్టల్‌ను ఇప్పటి వరకు 5 లక్షల 84 వేల మంది వీక్షించారని, ఇప్పటి వరకు 2,622 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని సీఎస్ తెలిపారు. ఇప్పటి వరకు 5,971 స్లాట్ బుకింగ్స్ జరగ్గా 6,239 మంది రూ. 7 కోట్ల 77 లక్షలు చెల్లించాలని సీఎస్ చెప్పారు. బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన ధరణి కంట్రోల్ రూంను సోమేశ్ కుమార్ సందర్శించారు. వంద మంది సభ్యుల బృందం సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ధరణి పోర్టల్ పనితీరు సంతృప్తికరంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ధరణి పోర్టల్