Government Appoint incharge Ministers for Districts : నేడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాల ప్రాతిపదికన జిల్లాకొక ఇంఛార్జి మంత్రిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం అమలును ఇంఛార్జి మంత్రులు పర్యవేక్షిస్తారని జీవోలో పేర్కొన్నారు.
అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు : సీఎం రేవంత్ రెడ్డి
ఏయే జిల్లాకు ఎవరెవరిని కేటాయించారంటే?
ఉమ్మడి జిల్లా | ఇంఛార్జి మంత్రి |
హైదరాబాద్ జిల్లా | పొన్నం ప్రభాకర్ |
రంగారెడ్డి జిల్లా | దుద్దిళ్ల శ్రీధర్ బాబు |
వరంగల్ జిల్లా | పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి |
కరీంనగర్ జిల్లా | ఉత్తమ్ కుమార్‌రెడ్డి |
మహబూబ్‌నగర్ | రాజనర్సింహా |
నిజామాబాద్ | జూపల్లి కృష్ణారావు |
ఖమ్మం జిల్లా | కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి |
నల్గొండ జిల్లా | తుమ్మల నాగేశ్వరరావు |
ఆదిలాబాద్ జిల్లా | సీతక్క |
Prajapalana Programme Details : రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమానికి ఈనెల 28 నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించి ఆరుగ్యారంటీలకు దరఖాస్తుతో వినతులు, ఫిర్యాదులు స్వీకరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దరఖాస్తును ముందు రోజే గ్రామాలకు పంపించాలని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ కోసం రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఆరు గ్యారంటీలకు తెల్లరేషన్ కార్డునే అర్హతగా తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti) స్పష్టం చేశారు.
రాష్ట్రంలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు అనే పదాలు వినిపించేందుకు వీల్లేదు - పోలీసులకు సీఎం కీలక ఆదేశాలు
ప్రజాపాలన ఉద్దేశాలు, నిర్వహణ తీరును కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, అదనపు కలెక్టర్ల సదస్సులో సీఎం వివరించారు. అధికారులు రెండు బృందాలుగా ఏర్పడాలని ఒక్కో బృందం రోజుకు రెండు గ్రామాల్లో ప్రజా సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి ఇంచార్జిగా, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి ప్రజాపాలన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు.
అధికారులు ప్రజల నుంచి గౌరవ, మర్యాదలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎంతటివారినైనా ఇంటికి పంపించే శక్తిమంతమైన చైతన్యం తెలంగాణ ప్రజలకు ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని పనిచేయాలన్నారు. అధికారులతో ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి సమీక్షిస్తామన్నారు. అధికారులు కూడా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అధికారులు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని భవిష్యత్తులో పోస్టింగులకు నిజాయతీని ప్రామాణికంగా తీసుకుంటామన్నారు.
అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు : సీఎం రేవంత్ రెడ్డి