నూతన సచివాలయ భవన నిర్మాణానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం... హైకోర్టులో వ్యాజ్యం నేపథ్యంలో పనులు ఇంకా ప్రారంభించలేదు. సచివాలయ భవనాలన్నింటిని.. ఖాళీ చేసినప్పటికీ ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు. హైకోర్టు స్టే కారణంగా భవనాలను సర్కారు ముట్టుకోలేదు. కొత్త సచివాలయ భవన నమూనా ఖరారు దిశగా ప్రభుత్వం గతంలోనే కొంత మేర కసరత్తు చేసింది. పలువురు ఆర్కిటెక్ట్‌లు సచివాలయ భవన నమూనాలకు సంబంధించిన డిజైన్లను ప్రభుత్వానికి అందించారు. వాటిని అధికారులు, ఇంజినీర్లు ప్రాథమికంగా పరిశీలించారు.
మరోమారు విచారణ..
సచివాలయ విషయమై ఇటీవల మరోమారు విచారణ జరిపిన హైకోర్టు... నిర్మాణ నమూనా, ప్రణాళిక తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించింది. కేవలం కూల్చివేతలపై మాత్రమే స్టే ఉందని... నమూనా, ప్రణాళిక తదితరాలపై ఎలాంటి స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో నూతన సచివాలయ భవన నమూనా ఖరారు దిశగా సర్కారు మరోమారు దృష్టి సారించింది.
హైకోర్టుకు నమూనా..
హైకోర్టుకు నమూనా ఇవ్వాల్సిన నేపథ్యంలో ఆ దిశగా కసరత్తు ప్రారంభించనుంది. ఆర్కిటెక్ట్‌ల నుంచి వచ్చిన నమూనాలను పరిశీలించి కొన్నింటికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సచివాలయ కార్యాలయాల కోసం అవసరమైన విస్తీర్ణం, భవనాలు, ఇతర మౌలిక వసతులు సహా అన్నింటినీ పరిగణలోకి తీసుకొని నమూనా, ప్రణాళికను ఖరారు చేయనున్నారు.
ఆర్కిటెక్ట్‌లతో త్వరలోనే సమావేశం..
వాహనాల పార్కింగ్ కోసం భూగర్భంలోనే మల్టీ లెవల్ పార్కింగ్ వసతి కల్పించాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా నమూనా సిద్ధం కానుంది. గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టడంతో పాటు సచివాలయ ప్రాంగణంలో విశాలమైన పచ్చిక బయలు ఉండేలా ప్రణాళిక, నమూనా ఖరారు చేయనున్నారు. ముంబయి, చెన్నై సహా వివిధ ప్రాంతాలకు చెందిన ఏడెనిమిది మంది ఆర్కిటెక్ట్‌లు సచివాలయ భవన నమూనాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నమూనా ఖరారుపై దృష్టి సారించిన ప్రభుత్వం... త్వరలోనే ఆర్కిటెక్ట్‌లతో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..