అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు, అనధికారిక ఆవాసాలను క్రమబద్ధీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2019 అక్టోబరు 15 నాటికి.. 300 చదరపు గజాల వరకు ఉన్న వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. జోనల్, రహదారి అభివృద్ధి, బృహత్తర ప్రణాళికల్లో భాగంగా ఉన్న భూములకు, ఆమోదం తెలిపిన లే అవుట్లకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. 75 చదరపు గజాలు, అడుగుల వరకూ ఉన్న వాటిని భూమి మూల విలువలో 75 శాతం రుసుముతో క్రమబద్ధీకరించాలని తెలిపింది. లబ్ధిదారు కేటగిరీ-1కి చెందినవారైతే (పేదలైతే) ఉచితంగా పట్టా, డీ ఫారం పట్టా పంపిణీ చేయాలని సూచించింది. 75- 150 చదరపు గజాల వరకూ భూమి మూల విలువలో 75 శాతం రుసుము, 150- 300 చదరపు గజాల వరకూ 100 శాతం రుసుముతో క్రమబద్ధీకరించేందుకు అనుమతించింది. ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది. అసైన్డు ఇంటి స్థలం లేదా అసైన్డు ఇంటి విక్రయానికి ప్రస్తుతమున్న గడువును 20 నుంచి పదేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఏపీ అసైన్డు, భూముల చట్టానికి సవరణలను ఆమోదించింది. సవరించిన చట్టం అమల్లోకి వచ్చే నాటికి అసైన్డు స్థలం లేదా అసైన్డు ఇంటిని విక్రయించిన వాటికి ఇది వర్తిస్తుందని పేర్కొంది.
చట్టం అమల్లోకొచ్చాక విక్రయించాలనుకుంటే నిర్దేశిత విధానం ప్రకారం రుసుములు తీసుకుని అమ్మకానికి అనుమతివ్వాలని నిర్ణయించింది. పోలవరం నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమోదించింది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని విలేకర్లకు తెలిపారు.
ప్రభుత్వ భవనాల కోసం ప్రైవేటు భూమి
- గ్రామాల్లో నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, పాలశీతలీకరణ కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర ప్రభుత్వ భవనాలకు స్థలాల కొరత దృష్ట్యా ప్రైవేటు భూమిని తీసుకోవాలి. బదులుగా మరోచోట ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు ఆమోదం.
- హైదరాబాద్‌లోని లోకాయుక్త కార్యాలయం కర్నూలుకు తరలింపు. లోకాయుక్త, ఉప లోకాయుక్త, రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, డైరెక్టర్ (విచారణ), ఇద్దరు అసిస్టెంట్ రిజిస్ట్రార్లు తదితర పోస్టుల మంజూరుకు ఆమోదం.
- రాష్ట్ర మానవహక్కుల కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలని నిర్ణయం.
- మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టుల సవరించిన డీపీఆర్‌కు ఆమోదం. రూ.5,155.73 కోట్లతో 36 నెలల్లో మచిలీపట్నం పోర్టు, రూ.4,361.9 కోట్లతో 30 నెలల్లో భావనపాడు ఫేజ్-1 పోర్టు నిర్మించాలని లక్ష్యం.
- శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్పలో రూ.1,720.61 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల డీపీఆర్‌లకు ఆమోదం.
- అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను 6 రకాలుగా వర్గీకరించేందుకు ఆమోదం.
క్లాప్‌కు ఆమోదం
క్లీన్ ఆంధ్రపదేశ్ (క్లాప్) కార్యక్రమానికి ఆమోదం. దీనిలో భాగంగా 124 మున్సిపాలిటీల్లోని 40 లక్షల ఇళ్ల నుంచి చెత్త సేకరణ. ‘జగనన్న స్వచ్ఛసంకల్పం’ కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 100 రోజులు కార్యక్రమాలు.
- రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన 4 లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఆగస్టు 24న రూ.500 కోట్ల పరిహారం పంపిణీకి ఆమోదం.
- పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల పెండింగ్ దరఖాస్తులను మూడు నెలలకోసారి సమీక్షించి, మంజూరు.
- వైఎస్‌ఆర్ నేతన్న నేస్తానికి బడ్జెట్‌లో రూ.199 కోట్ల కేటాయింపు. ఆగస్టు 10న సాయం అందజేత.
కొత్తగా రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ
రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ఆమోదం.దీని పరిధిలోకి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలుతో పాటు గోదావరి, ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థల్లోని కొంత భాగాన్ని తీసుకొస్తారు. 207 గ్రామాలు, 17 మండలాలు, 3 పట్టణ స్థానిక సంస్థలతో 1,566 చదరపు కిలోమీటర్ల పరిధితో ఏర్పాటు.
ఎమ్మెల్యేలు వారానికి మూడు రోజుల చొప్పున నెలలో 12 రోజులు కచ్చితంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి. ప్రజాసమస్యల పరిష్కారం, సేవల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి. మంత్రులు నెలలో విధిగా 2 రోజులు, వీలును బట్టి 12 రోజుల వరకు సచివాలయాల్ని సందర్శించాలి. జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు కూడా సచివాలయాలకు వెళ్లాలి.
ఇదీ చదవండి: నీటిపారుదలపై కేసీఆర్ సమీక్ష... ఆదివారం మరోసారి భేటీ