Gold Seized At Shamshabad Airport : హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టుబడటం పరిపాటిగా మారిపోయింది. అనేక మార్గాల్లో పుత్తడిని నగరంలోకి అక్రమంగా తీసుకురావాలని కొందరు అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పేస్ట్‌ల రూపంలో, చాక్లెట్ల రూపంలో, బిస్కెట్ల రూపంలో ఇలా రకరకాల మార్గాల్లో బంగారాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.
Gold Seized At Shamshabad Airport in Hyderabad : ఈ క్రమంలోనే నేడు భారీ మొత్తంలో అక్రమ బంగారం అధికారులకు పట్టుబడింది. సుమారు రెండు కిలోల బంగారాన్ని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ రూ.1.13 కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. రియాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి ఇంత మొత్తంలో బంగారాన్ని స్వాధీన పరుచుకున్నారు. అధికారులకు విశ్వసనీయ సమాచారం అందడంతో.. ముందే ఎయిర్‌పోర్టు వద్ద అధికారులు కాపు కాసి నిందితుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పేస్ట్‌లా చేసి సాక్స్‌లలో.. : రియాద్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులపై అనుమానం రావడంతో అధికారులు వారిని తనిఖీ చేశారు. ఆ ముగ్గురు అక్రమార్కులు సాక్స్‌ల్లో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచుకొని తీసుకొచ్చినట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. ఆ బంగారం సుమారు 1818.98 గ్రాములు.. అనగా సుమారు 2 కిలోలు ఉంది. ఆ గోల్డ్‌ను వారి వద్ద నుంచి తీసుకొని.. ముగ్గురు వ్యక్తులపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ బంగారాన్ని ఎవరి గురించి తీసుకు వచ్చారనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు.
"రోజూలాగే మేం ప్రయాణికులను చెక్ చేస్తున్నప్పుడు ఇవాళ అనుమానంగా కనిపించిన ముగ్గురు ప్రయాణికులను క్షుణ్నంగా తనిఖీ చేశాం. మేం ఊహించినట్లుగానే వారి వద్ద బంగారం పట్టుబడింది. దాని విలువ దాదాపు రూ.1.13 కోట్లు ఉంటుంది." - కస్టమ్స్ అధికారులు, శంషాబాద్ ఎయిర్ పోర్టు
బంగారు చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు : రెండు వారాల క్రితం ఇదే విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 13 బంగారు చాక్లెట్లను శంషాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ గోల్డ్‌ను పట్టుకున్నారు. వారు తెచ్చుకున్న బ్యాగ్‌లను తనిఖీ చేయగా.. అందులో చాక్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని చూడగా అందులో బంగారం ఉంది. దీని విలువ సుమారు 269 గ్రాములుగా గుర్తించారు. దీని మొత్తం విలువ రూ.16.5 లక్షలుగా లెక్కించారు. ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో రూ.కోట్ల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి :