చెన్నై నుంచి విజయవాడ మీదుగా వరంగల్, హైదరాబాద్ నగరాలకు అక్రమంగా తరలిస్తున్న 31.5 కిలోల బంగారం పట్టుకున్న ఘటన మరవక ముందే శంషాబాద్ విమానాశ్రయంలో మూడు రోజుల వ్యవధిలో అయిదు కిలోల బంగారం పట్టుబడింది. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న రోజు రోజూకు స్మగ్లర్లు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు.
వయా చెన్నై నౌకాశ్రయం
శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు నిఘా పెంచారు. దీంతో బంగారాన్ని విదేశాల నుంచి చెన్నై నౌకాశ్రయానికి చేరవేస్తున్నారు. అక్కనుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్, వరంగల్ నగారాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. దీంతో అధికారుల ఎత్తులకు పై ఎత్తులతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నట్లు స్పష్టం అవుతోంది.
గత ఆదివారం దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. కోటి విలువైన రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 11వ తేదీన హైదరాబాద్, ముంబయి విమానాశ్రయాల్లో ఏడుగురు బంగారం అక్రమ రవాణాదారులను అరెస్ట్ చేసి రెండున్నర కిలోలకుపైగా బంగారాన్ని గుర్తించారు.
రెండు వారాల్లో 15 కోట్లు
బంగారం అక్రమంగా రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. రెండు వారాల వ్యవధిలోనే రూ.15 కోట్లు విలువైన బంగారం పట్టుబడింది. ఈ వరుస ఘటనలను పరిశీలించిన డీఆర్‌ఐ, కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ రవాణా వెనుక స్మగ్లింగ్ ముఠా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన 20 మంది నుంచి సమాచారాన్ని రాబట్టే పనిలో అధికారులు ఉన్నారు.
సూత్రదారుడు ఎవరు
ఆ 20 మంది కమిషన్ కింద పని చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లు, వాట్సప్ మెసేజ్‌లను విశ్లేషిస్తున్నారు. ఆ ముఠా పెద్ద తలకాయ ఎవరనే కోనంలో వీరి నుంచి కూపీలాగుతన్నట్లు తెలుస్తోంది. ఆ సూత్రదారులు దొరికితే విదేశాల నుంచి ఇప్పటి వరకు ఎంత బంగారం చేరవేశారు... ఆ బంగారం ఎవరికి విక్రయిస్తున్నారు... తదితర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నాురు.
స్మగ్లర్ల ఎత్తులకు చిత్తులు
నిఘా వ్యవస్థను పటిష్ఠం, ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను బలోపేతం చేసుకోవడం వల్లే ఈ స్మగ్లర్ల ఎత్తులను చిత్తు చేయగలుగుతున్నామని అధికారులు చెబుతున్నారు. అక్రమ రవాణాకు రూట్ మార్చినా... మహిళ కూలీలను రంగంలోకి దింపినా... వారి ఆటలు సాగనియమన్నారు. స్మగ్లర్ల ఎత్తుల్నీ చిత్తు చేస్తోన్న డీఆర్, కస్టమ్స్ అధికారులు రూ. కోట్ల విలువ చేసే బంగారాన్ని పట్టుకున్నారు. వరుస పట్టబడులతో అక్రమ రవాణాదారుల వెన్నులో వణుకు పుడుతోందని అధికారులు అంటున్నారు.
ఇదీ చూడండి: నేడు స్వదేశానికి 15 మంది గల్ఫ్ బాధితులు