ఆస్తిపన్ను సకాలంలో చెల్లించకపోతే పెనాల్టీ తప్పదని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. పన్ను సకాలంలో చెల్లించకపోతే ఇకపై ప్రతినెలా 2 శాతం పెనాల్టీతో పన్ను చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు పన్ను చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. మొదటి ఆరు నెలల్లో... ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మాసాల్లో మొదటి మూడు నెలలైన ఏప్రిల్, మే, జూన్ నెలకు ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఆ తర్వాత వచ్చే మూడు నెలలు జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఒక్కో నెలకు 2 శాతం చొప్పున పెనాల్టీ చెల్లించవలసి ఉంటుందని బల్దియా వెల్లడించింది. అదే విధంగా మిగతా ఆరు నెలల కూడా వర్తించనుందని స్పష్టం చేసింది.
మిగిలిన వారు త్వరగా చెల్లించాలి..
ఒకవేళ ఏడాది పాటు ఆస్తిపన్ను చెల్లించనివారు 24 శాతం పెనాల్టీతో పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 17,34,411 కమర్షియల్, రెసిడెన్షియల్, మిక్సిడ్ గల భవనాల కలిగిన పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. అందులో 9,06,486 ప్రాపర్టీలకు ఇప్పటి వరకు సుమారు రూ.887కోట్ల అస్తి పన్ను చెల్లించారు. మిగిలిన వారు కూడా వెంటనే చెల్లించి 2 శాతం పెనాల్టీ నుంచి మినహాయింపు పొందాలని బల్దియా అధికారులు కోరుతున్నారు.
కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన
జీహెచ్ఎంసీ పరిధిలో కమర్షియల్ రోడ్లకు ఇరువైపులా ఉన్న భవనాలను సర్వే చేసేందుకు 340 సర్వేటీంలు ఏర్పాటు చేశారు. వారు ఇంటింటికి వెళ్లి మిక్సింగ్, కమర్షియల్ అనుమతి లేకుండా పై అంతస్తు భవానాలు ఉన్న పక్షంలో మార్చుకునేందుకు స్వయంగా దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించారు. తద్వారా 49,439 మంది స్వయంగా ట్యాక్స్ మదింపునకు విన్నవించుకున్నారు. అలా వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేస్తున్నారు. ఇంకా మదింపు కానీ, తక్కువ అసెస్మెంట్ ఉన్న నిర్మాణాలను పరిశీలించి వాటికి రూల్స్ ప్రకారంగా ట్యాక్స్ రివిజన్ చేసే పక్రియ కొనసాగుతోంది.
ఇదీ చూడండి: 'మంగళవారం మరదలమ్మా' వ్యాఖ్యలపై మంత్రి ఏమన్నారంటే...?