హైదరాబాద్ ఒకప్పుడు పూల తోటలు, కొండలు, గుట్టలు, అడుగడుగునా కనిపించే చెరువులతో దర్శనమిచ్చేది. గొలుసుకట్టు చెరువుల చుట్టూ ఉద్యానవనాలు అలరించేవి. నగరీకరణతో ఆ వాతావరణం పూర్తిగా పక్కదారి పట్టింది. భాగ్యనగరానికి అందమైన పార్కులు అవసరమని గుర్తించిన జీహెచ్‌ఎంసీ, ఆమేరకు పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఐదింటికి నమూనాలు సిద్ధం చేశామని, మరో పార్కు గురించి చర్చలు జరుగుతున్నాయని కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత ‘ఈనాడు’కు తెలిపారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గతంలో ఈ తరహా థీమ్ పార్కులను అభివృద్ధి చేశామని, అవి మంచి ప్రజాదరణ పొందుతున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి జోన్‌లో మరో ఆరు పార్కుల నిర్మాణానికి ఏర్పాట్లు చేశామన్నారు.
పచ్చదనం పెంపు లక్ష్యంగా..
నగరంలో పచ్చదనం పది శాతానికన్నా తక్కువ ఉంది. దాన్ని గణనీయంగా పెంచేందుకు పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు బల్దియా తెలిపింది. టెండర్ల ప్రక్రియ మొదలైందని, ఏడాది చివరికి అన్ని పార్కులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే నిర్మాణమైన థీమ్ పార్కుల్లో శేరిలింగంపల్లిలోని డాగ్ పార్కు, పంచతంత్ర పార్కు, మలక్‌పేట లోని దివ్యాంగుల పార్కు, జూబ్లీహిల్స్‌లో ఫ్రూట్ పార్కు, మీరాలంలో లేక్ పార్కు, కిషన్‌బాగ్ ఉద్యానం ఉన్నాయి.
సువాసనల పూలవనం..
జోన్ పరిధిలోని చారిత్రాత్మక ఫాక్స్ సాగర్‌ను మిషన్ కాకతీయ పథకం కింద ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. దానికి సమీపంలో పూలవనాన్ని నిర్మిస్తున్నాం. అందులో సువాసన వెదజల్లే పూల మొక్కలు ఉంటాయి. మల్లెలు, చామంతి, వంటి అనేకరకాల పూల మొక్కలకు పార్కు చిరునామాగా నిలుస్తుంది. చెరువు పరిసరాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నాం. మరోచోట ఎల్‌ఈడీ దీపకాంతులతో కళ్లు మిరుమిట్లుగొలిపే థీమ్‌పార్కును నిర్మిస్తున్నాం. రంగు రంగుల ఎల్‌ఈడీ దీపాలతో చెట్లను, కాలిబాటను, ఫౌంటెయిన్‌ను అలంకరిస్తాం. రాత్రిళ్లు ఈ పార్కు ప్రత్యేకంగా కనిపిస్తుంది. పర్యావరణ ప్రాముఖ్యతను తెలిపేలా ఎన్విరాన్‌మెంటల్ పార్కుకు శ్రీకారం చుట్టాం. జిమ్, ప్లే, యోగా పార్కుల డిజైన్లూ పూర్తయ్యాయి. త్వరలో నిర్మాణ పనులు మొదలవుతాయి
-వి.మమత, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సందేహానికి ప్రధాని స్పష్టత