హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు కనీసం 400 మెట్రిక్ టన్నులకుపైగా భవన నిర్మాణ వ్యర్థాలను... బహిరంగ ప్రదేశాల్లో, రహదారుల వెంట, నాలాలు, చెరువుల్లో వేస్తున్నారు. వీటిని సేకరించడానికి జీహెచ్ఎంసీ పూనుకుంది. రోడ్లు, చెరువులు, నాలాల వెంట ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
పది రోజుల పాటు
ఈ నెల 20 నుంచి 29 వరకు పది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రతీ సర్కిల్‌లో తాత్కాలికంగా భవన నిర్మాణ వ్యర్థాలను డిపాజిట్ చేసేందుకు ప్రత్యేకంగా ఖాళీ స్థలాలను గుర్తించాలని పేర్కొన్నారు. ఈ పది రోజులు కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు పాల్గొని నగరంలోని నిర్మాణ వ్యర్థాలన్నింటిని సేకరించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
235 మెట్రిక్ టన్నులు
నగరంలో ఇటీవల నిర్వహించిన నిరుపయోగ వస్తువుల సేకరణ డ్రైవ్‌లో మొత్తం 235 మెట్రిక్ టన్నుల వస్తువులను సేకరించామన్నారు. నగరంలో అక్రమంగా నిర్మాణ వ్యర్థాలు వేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానా విధిస్తామని మేయర్ హెచ్చరించారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!