Old Buildings Demolition in Hyderabad : వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ వాసులకు వెన్నులో వణుకుపుడుతోంది. మ్యాన్‌హోల్స్, నాళాలు పొంగిపొర్లడం వల్ల కాలు తీసి బయటపెడితే.. క్షేమంగా ఇళ్లు చేరతామా అనే గుబులు వెంటాడుతోంది. ఇంట్లోనైనా క్షేమంగా ఉండగలుగుతున్నారా అంటే.. ముంపు ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే వారు క్షణమొక యుగంలా కాలం వెల్లదీస్తున్నారు. అధికారుల నిర్లక్షంతో.. ఏటా వర్షాకాలంలో శిథిలావస్థలోని భవనాలు కూలి ప్రాణాలు పోతున్నాయి. ఎండాకాలంలో జంట నగరాల్లో 524 శిథిలావస్థలో ఉన్న భవనాలు కూల్చాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కేవలం 140 మాత్రమే కూల్చివేశారు. 222 భవనాలు ఖాళీ చేయించి సీజ్ చేశారు.
హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాతబస్తీలోని మీలాత్ నగర్‌లో గోడ కూలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పాతబస్తీ, మెహిదీపట్నం, సికింద్రాబాద్‌తోపాటు అనేక చోట్ల.. వందల ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు ఉన్నాయి. వేలసంఖ్యలో ఉన్న ఆ భవనాల్లో.. చాలా వరకు ఎప్పటికప్పుడు నిర్వహణ చేపడుతుండడంతో నాణ్యతగానే ఉన్నాయి. కానీ దాదాపు.. 2 వేల భవనాలు శిథిలావస్థకు చేరాయి.
కూల్చేది పదుల సంఖ్యలోనే.. : ఏటా ఎండాకాలంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు గుర్తించాలని జోనల్ కమిషనర్లకు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తారు. క్షేత్రస్థాయిలో తిరగకుండానే వేలల్లో ఉన్న శిథిల భవనాలు వందల్లో ఉన్నాయని.. కూల్చివేతలు చేపట్టారు. కానీ వారు కూల్చేది.. పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. అధికారుల లక్ష్యం ఏటా 10 శాతం దాటడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేసవికి ముందే శిథిలావస్థలోని భవనాలు గుర్తించి కూల్చేయాలి. కానీ చాలా భవనాల కూల్చివేతలకు నోటీసులు ఇచ్చినా.. రాజకీయ జోక్యం వల్ల, భారీగా ముడుపులు ఇవ్వడం వల్ల.. కూల్చివేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.