GHMC mayor on hyderabad rains : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్‌లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంకు కాల్చేసి.. అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూంను ఆమె పరిశీలించారు. నగరవాసుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమస్యల పరిష్కారంపై అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నామని మేయర్ పేర్కొన్నారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. 946 ఫిర్యాదులు వచ్చాయని అన్నింటిని పరిష్కరించామన్నా మేయర్...ఒక్క నారాయణగూడలో మాత్రమే కొంత నీటి సమస్య ఉందని తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన 780 కోట్ల వ్యయంతో.. నాలా పనులు 36చోట్ల జరిగితే 30పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.
గతేడాది సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు లేవన్నారు. నగరంలో సీఆర్‌ఎంపీకి చెందిన 28 బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని.. 24గంటల పాటు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో బల్దియా సిబ్బంది, అధికారులు ఈ ఐదు రోజులు ఎలా పనిచేశామో.. అనునిత్యం అలాగే పనిచేస్తామని మేయర్ స్పష్టంచేశారు. శిథిలావస్థలో ఉన్న 5 గోడలు పడిపోయిన ఫిర్యాదులు, లింగోజిగూడ, హిమాయత్ నగర్, ఆదర్శ్ నగర్ (స్ట్రీట్ నెం .14), ఎన్.టి.ఆర్ నగర్, అల్తాఫ్ నగర్ కాలనీ లలో నీరు రావడంతో తొలగించడం జరిగిందని తెలిపారు.
రానున్న రోజుల్లో 429 బృందాలు పనిచేస్తాయని తెలిపారు. నగరంలో 483 శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. వీటిలో 92 భవనాలకు మరమ్మత్తు చేసుకునే అవకాశం ఇచ్చామని.. 19భవనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నగరంలో పురాతన ఇళ్లు ఉన్నవారిని.. మరమ్మతులకు ఆదేశించినట్లు తెలిపారు. అందులో ఉంటున్న135 మందిని ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు. వీలైనంత వరకు ప్రజలు బయటకు రావద్దని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలన్నారు.
"రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్‌లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. నగరంలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. ఇప్పటివరకు తొమ్మిది వందల ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిని పరిష్కరించాము. ఒక్క నారాయణగూడలో మాత్రమే కొంత నీటి సమస్య ఉంది. 24గంటల పాటు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య తలెత్తినా అధికారులకు ఫిర్యాదు చేయండి. నగరంలో 483 శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి నోటీసులు ఇచ్చాము". - విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ మేయర్
ఇవీ చదవండి: