కొత్తగా ఇల్లు లేదా భవనం నిర్మించుకుని.. ఆస్తిపన్ను నిర్ధరణ కోసం వేచి చూసే వారికి శుభవార్త. దళారుల అవసరం లేకుండా, జీహెచ్‌ఎంసీ ఆఫీసు చుట్టూ తిరగకుండా.. ఇంట్లో కూర్చుని ఆస్తిపన్ను మదింపునకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరికీ లంచం ఇవ్వక్కర్లేదు. జీహెచ్‌ఎంసీ వైబ్‌సైట్‌లోని ‘సెల్ఫ్ అసెస్‌మెంట్’ దరఖాస్తు నింపితే చాలు. ఇంటి అనుమతి, ఇతర పత్రాల్లోని వివరాలను దరఖాస్తులో రాసి, అవసరమైన పత్రాలు జోడిస్తే ఆస్తిపన్ను నిర్ధరణ సర్టిఫికెట్‌ను పొందొచ్చు. జీహెచ్‌ఎంసీ నయా విధానాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
స్వీయ ధ్రువీకరణకు వచ్చిన దరఖాస్తులు: 3,434
ఆమోదం పొందినవి: 2,042
తిరస్కరించినవి: 1,174
ఉపయోగించుకోవడం ఇలా..
దరఖాస్తు చేయాలనుకున్న వారు https://www.ghmc.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ప్రధాన మెనూపై కనిపించే ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ను క్లిక్ చేసి ‘సెల్ఫ్ అసెస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్’ ఎంపికను ఎంచుకోవాలి. మొదట పీటీఐఎన్(ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబరు) ఉందా, లేదా అని అడుగుతుంది. కొత్త ఇంటికి పీటీఐఎన్ ఉండదు. అక్కడ ‘లేదు’ అనే మీటను నొక్కాలి. వెబ్‌సైట్ ఇప్పుడు యజమాని చరవాణి సంఖ్యను అడుగుతుంది. ఇక్కడిచ్చే ఫోన్ నెంబరుతోనే ఆస్తిపన్ను వివరాలు జతవుతాయి. ఫోన్ నెంబరు ఇస్తే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని పొందుపరిస్తే దరఖాస్తు వస్తుంది. అన్ని వివరాలు నింపాలి.
ఇంటి అనుమతి సంఖ్య, చిరునామా, నిర్మాణం చేపట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబరు, తేదీ, ఇంటికి కుడి, ఎడమ వైపు ఉండే ఇళ్ల నంబర్లు తదితర వివరాలను ఇవ్వాలి. వాటిని సరిగా ఇవ్వగలమా, లేదా అనే భయం వద్దని అధికారులు చెబుతున్నారు. సర్కిల్‌ను, ప్రాంతాన్ని సవ్యంగా ఎంచుకుంటే మిగిలిన వివరాలను ఐచ్ఛికాల నుంచి ఎంపిక చేసుకోవచ్చంటున్నారు. ఎలాంటి భవనం అనే చోట.. అనుమతి లేకుండా కట్టిన గృహమా? అనుమతి తీసుకుని 10శాతం అదనంగా ఇంటి ప్లాన్‌ను ఉల్లంఘించి కట్టారా, 10శాతానికన్నా తక్కువ ఉల్లంఘనతో కట్టారా, ప్లాన్ ప్రకారమే నిర్మించారా అనే ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి. అనంతరం ఎలాంటి నిర్మాణం(స్లాబు, రేకులు, ఇతరత్రా), వినియోగం(బ్యాంకు, ఇల్లు, ఏటీఎం, కమర్షియల్, ఇతరత్రా), అంతస్తు, నిర్మాణం వయసు, పొడవు, వెడల్పు, మొత్తం విస్తీర్ణం వివరాలు ఇవ్వాలి. చివరగా ఇంటి అనుమతి పత్రం, నివాసయోగ్యపత్రం, సేల్ డీడ్‌లలో అందుబాటులో ఉన్న పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. తెలిపిన వివరాలన్నీ నిజమేనని స్వీయ ధ్రువీకరణ చేస్తూ దరఖాస్తు రుసుము కోసం ‘ప్రొసీడ్ టు పే’ అనే మీటపై క్లిక్ చేస్తే.. రుసుము చెల్లించే ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత నెల రోజుల్లోపు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.
ఇదీ చూడండి: TS government: జిల్లాల్లో కొలువుల భర్తీ... కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వం!