జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చూపించుకునేందుకు కొందరు నాయకులు అధిష్ఠానాన్ని ఒప్పించి... తమ వారికి టికెట్లు ఇప్పించారు. రంగంలోకి దిగిన వారి వారసులు కొందరిని మెప్పించగలిగి విజయం సాధించారు. మరికొందరు డీలా పడిపోయారు.
వారిని విజయం వరించింది...
* పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి(ఖైరతాబాద్ డివిజన్) తెరాస పక్షాన పోటీ చేసి భాజపా అభ్యర్థి మాధురిపైనా, ఎంపీ కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి(బంజారాహిల్స్ డివిజన్) భాజపా నేత బద్దం బాల్‌రెడ్డి కుమారుడు మహిపాల్‌రెడ్డిపై విజయం సాధించారు.
* మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతిరెడ్డి(అల్వాల్ డివిజన్) భాజపా అభ్యర్థి వీణాగౌడ్‌పై గెలిచారు.
* తెరాస ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి సోదరుడు రాజేశ్వర్‌రెడ్డి కోడలు వి.సింధూ ఆదర్శ్‌రెడ్డి(భారతీనగర్ డివిజన్) భాజపా అభ్యర్థి గోదావరి అంజిరెడ్డిపై గెలిచారు.
* ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బావ జూపల్లి సత్యనారాయణ(కూకట్‌పల్లి) భాజపా అభ్యర్థి పవన్‌కుమార్‌పై, ఎమ్మెల్యే మరదలు మాధవరం రోజాదేవి (వివేకానంద్‌నగర్ డివిజన్) భాజపా అభ్యర్థి కల్పనపై గెలుపొందారు.
* మాజీ ఎంపీ ఆలె నరేందర్ కోడలు భాగ్యలక్ష్మి గౌలిపుర డివిజన్(భాజపా) నుంచి పోటీచేసి గెలిచారు.
వారు ఓటమి చవిచూసి
ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి సతీమణి, హబ్సిగూడ కార్పొరేటర్ స్వప్న మళ్లీ అదేచోట పోటీ చేశారు. భాజపా అభ్యర్థి చేతన హరీష్ చేతిలో 1800 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
* మాజీ హోంమంత్రి నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ తెరాస అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్ఢి. భాజపా అభ్యర్థి రవికుమార్ చేతిలో 528 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
* గాంధీనగర్ డివిజన్ నుంచి బరిలో దిగిన ముషీరాబాద్ శాసనసభ్యుడు ముఠాగోపాల్ మరదలు పద్మ భాజపా అభ్యర్థి పావని చేతిలో 2,576 ఓట్లతో ఓడిపోయారు.
* కవాడిగూడ డివిజన్‌లో పోటీచేసిన ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత కమలం పార్టీ అభ్యర్థి రచనశ్రీ చేతిలో 1,477 ఓట్ల తేడాతో ఓడారు.
మేయర్ భార్య గెలుపు..
2016లో చర్లపల్లి డివిజన్ నుంచి తెరాస అభ్యర్థిగా గెలిచిన బొంతు రామ్మోహన్‌కు మేయర్ పీఠం దక్కింది.. ఈ దఫా మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఆయన పోటీకి దూరంగా ఉండి తన భార్య శ్రీదేవి యాదవ్‌ను రంగంలోకి దించారు. భాజపా అభ్యర్థిపై ఆమె విజయం సాధించారు.
ఇదీ చూడండి: గ్రేటర్ ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా... త్వరలో సమీక్ష