గ్రేటర్ హైదరాబాద్‌లో భవన నిర్మాణ అనుమతులను మరింత సులభతరం చేసేందుకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు బల్దియా కమిషనర్ దానకిషోర్ వెల్లడించారు. పట్టణ ప్రణాళిక, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులు, బిల్డర్లతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రవేశ పెట్టిన డీపీఎంఎస్ విధానంలో నిర్మాణ అనుమతులు సకాలంలో లభించినప్పటికీ ఇతర శాఖల అనుమతుల్లో జాప్యం జరిగేది. దీనిని అధిగమించేందుకు ఏకగవాక్షం ద్వారా కామన్ అప్లికేషన్ను ఇందులో పొందుపరిచినట్లు కమిషనర్ తెలిపారు. ఈ విధానం పెద్ద బిల్డర్లకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. 500 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు వచ్చే దరఖాస్తులు నిబంధనల ప్రకారం ఉంటే ఒకే రోజులో అనుమతులను జారీచేసే ప్రతిపాదన ఉందని వివరించారు. 200 గజాలలోపు స్థలం ఉంటే సెల్ఫ్ అప్రూవల్ ద్వారానే ఇళ్ల నిర్మాణం చేపట్టే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని కమిషనర్ తెలిపారు.
ఇదీ చూడండి : సమస్య ఏదైనా... పోలీస్స్టేషన్ వెళ్లాల్సిన పని లేదు