జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను సహించేదిలేదని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ నగర పారిశుద్ద్య కార్యక్రమాలపై అర్వింద్ కుమార్ సమీక్ష నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో వర్షాకాలం రానుండటంతో రహదారులపై పూర్తి స్థాయిలో చెత్తను తొలగించాలన్నారు. ప్రతిరోజు చెత్తను తొలగించడం ద్వారా అంటువ్యాధులు, కరోనా వ్యాప్తిని నివారించవచ్చని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు సూచించారు.
నిర్లక్ష్యం తగదు..
జీహెచ్‌ఎంసీ పరిధిలో తిరిగి కొవిడ్ కంట్రోల్ రూం ప్రారంభంకానుందని అర్వింద్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6గంటలలోపే క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించాలని డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్‌ఓలను ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై నిర్లక్ష్యం వహించడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని స్పష్టం చేశారు. నగరంలో బాధ్యతారహితంగా రహదారులపై చెత్తవేసే వారిని గుర్తించి జరిమానా విధించాలని పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వారాంతపు లాక్‌డౌన్‌పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలి: హైకోర్టు