జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.6150 కోట్లతో ఆమోదించిన బడ్జెట్‌ను రూ.5254 కోట్లకు సవరించారు.
2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.5380 కోట్లతో పద్దు ప్రతిపాదించగా.. మేజర్ ప్రాజెక్టులకు రూ.1593 కోట్ల రూపాయలు కేటాయించారు.
స్థాయీ సమావేశానికి సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలను డిసెంబర్ పదో తేదీలోగా ఆమోదించాల్సి ఉంటుంది. డిసెంబర్ 15న జరగనున్న సర్వసభ్య సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టి 2020 జనవరి పదో తేదీన పూర్తిస్థాయిలో సమీక్షిస్తారు.
గ్రేటర్ పరిధిలో ఉన్న ట్రేడ్ లైసెన్స్‌ల ధరలను సవరిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంఘం ఆమోదించింది. జీహెచ్ఎంసీలో 3,142 శాశ్వత ఉద్యోగులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి 3 కోట్లా 71లక్షల రూపాయలు చెల్లించేందుకు పచ్చజెండా ఊపింది.
మున్సిపల్ మార్కెట్లలో రిజర్వేషన్లకు కూడా ఆమోదముద్ర వేసింది. ఇకనుంచి వంద దుకాణాల్లో ఎస్సీలకు 15, ఎస్టీలకు 5, దివ్యాంగులకు 3, మహిళా సంఘాలకు 10, నాయీ బ్రాహ్మణులకు 5, జనరల్‌కు 51 యూనిట్లు కేటాయిస్తారు.
- ఇదీ చూడండి : మున్సిపోల్స్ "ఈసీ" మార్గదర్శకాలు..!