శ్రీశైలం పవర్ ప్లాంటులో అగ్నిప్రమాదంపై రాత్రి 10.35 గంటలకు తనకు మొదటి ఫోన్ వచ్చిందని సీఎండీ ప్రభాకర్‌రావు చెప్పారు. అగ్నిప్రమాదం ఘటనపై సీఎం, మంత్రికి ఫోన్ చేసి తెలిపానని అన్నారు. అర్ధరాత్రి 2.45 గం.కు శ్రీశైలం పవర్ ప్లాంటుకు చేరుకున్నామని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారని వివరించారు. అప్పటికే పవర్ ప్లాంటు నుంచి 11 మంది బయటకు వచ్చారని, మరో 9 మంది సిబ్బంది లోపల ఉన్నట్లు తెలిసిందన్నారు. లోపలకు వెళ్లాలని ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్లతో లోనికి వెళ్లారని అన్నారు. ఎంత ప్రయత్నం చేసినా 9 మంది చనిపోవడం బాధాకరమని సీఎండీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తామని చెప్పారు.
చివరి నిమిషం వరకు ప్రయత్నం
ఆరో యూనిట్ ప్యానెల్ బోర్డులో అగ్నిప్రమాదం జరిగిందని సీఎండీ తెలిపారు. ఆరో యూనిట్‌లో ట్రిప్ చేయాలని ప్రయత్నించినా ట్రిప్ కాలేదని, ఆలోగా మిగతా యూనిట్లలో వైబ్రేషన్లు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇంజినీర్లు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారని, నీళ్లు యూనిట్ లోనికి వస్తే మొత్తం మునిగి పోయేదని వెల్లడించారు. ఇంజినీర్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్లాంటును సురక్షితంగా కాపాడరని, చివరి నిమిషం వరకు ఇంజినీర్లను కాపాడడానికి ప్రయత్నించామని అన్నారు.
అంతర్గత విచారణ
వ్యవస్థ విఫలమవడానికి కారణాలపై కమిటీ ఏర్పాటు చేశామని, అగ్నిప్రమాద ఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నామని వివరించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా నిపుణుల కమిటీ వేస్తామన్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని సీఎండీ అన్నారు. 2017లో యూపీ ఎన్టీపీసీ కర్మాగారంలో బాయిలర్ పేలి 38 మంది మృతి చెందారని, గతంలో జరిగిన ఘటనలపై అధ్యయనం చేస్తున్నామని.. ఈలోగానే శ్రీశైలం అగ్నిపమాదం ఘటన జరిగిందని వివరించారు. శాఖాపరంగా, సీఐడీ విచారణ ఆధారంగా ఘటనకు కారణాలు తెలుస్తాయని అన్నారు. ఘటనకు 15 రోజుల ముందు కూడా యూనిట్ వద్దకు వెళ్లామని, యూనిట్ సిబ్బంది పనితీరుపై అభినందించామని వివరించారు.
ఇదీ చూడండి : ఆ ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదు : రేవంత్ రెడ్డి