హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజన్న బావిలో ప్రతి ఏటా వినాయక నిమజ్జనం జరుగుతోంది. నిమజ్జనానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. కరోనా వల్ల ఈ ఏడాది ఉత్సవాలు జరుపుకోవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందువల్ల అధికారులు రాజన్న బావి వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.
ఛత్రినాక పీఎస్ పరిధిలో గణేశ్ విగ్రహాలు ప్రతిష్టించిన వారు రాజన్న బావిలో నిమజ్జనం చేస్తారు. ఈ ఏడు అక్కడ నిమజ్జన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల బావి గోడపై వినాయక విగ్రహాలు పెట్టి వెళ్లిపోతున్నారు. నిమజ్జన ప్రాంతంలో చెత్తా చెదారం, మురికి నీరు ఉండటంపై భక్తులు నిరసన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న భాగ్యనగర గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు రాజన్న బావి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే బావి వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.