హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడ నుంచి వచ్చే రసాయన నాలా పారిశ్రామిక వ్యర్థ జలాలను మోసుకొచ్చి హుస్సేన్ సాగర్లో కలుపుతోంది. అక్కడి నుంచి ఓ నాలా లోయర్ ట్యాంక్ బండ్, గాంధీనగర్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్తోంది. హుస్సేన్ సాగర్ నుంచి మురుగు నీరంతా ఈ నాలా గుండా బయటికి వెళ్తోంది. అదే ఇక్కడి పరిసర నివాసితులకు శాపంగా మారుతోంది. గాంధీనగర్ పరిధిలో నాలా పరివాహక ప్రాంతాల్లో మురుగు, రసాయన వ్యర్థాలు వెదజల్లే ఘాటు వాసనలు ఓ సమస్య కాగా... ఇక్కడ నాలాపై రక్షణ గోడ లేకపోవడం మరో సమస్యగా మారింది.
కునుకు లేదు...
ఈ ప్రాంతంలో ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉండటం ఆడుకుంటూ ఆవైపు వెళ్తే ఎక్కడ పడిపోతారోనని తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మరోవైపు రాత్రయితే వచ్చే దుర్వాసనలతో కంటి మీద కునుకు లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. నాలాపై వెంటనే రక్షణ గోడ నిర్మించి ప్రమాదం తప్పించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: paddy procurement in telangana: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. అన్నదాతల అవస్థలు