జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... భౌతిక దూరం పాటించాలన్న నిబంధనల మేరకు.. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పాలకవర్గం సమావేశం జరిగింది. మార్కెట్ తాత్కాలికంగా తరలింపుపై విస్తృతంగా చర్చించారు.
ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల ఒక దశలో... మార్కెట్ కమిటీ ఛైర్మన్, కమీషన్ ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోహెడలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే తాము వెళ్లేందుకు సిద్ధమని కమీషన్ ఏజెంట్లు తేల్చిచెప్పారు.
ఇప్పటికే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసిన దృష్ట్యా... అందరి ఆరోగ్యహితం కోసం.. తరలివెళ్లాలని మార్కెట్ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ నెల 15 నుంచి ఆపిల్ సీజన్ ప్రారంభవుతున్నందున... కమిటీ కీలక నిర్ణయం తీసుకోనుంది.
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వీరమల్ల రాంనర్సింహగౌడ్ అధ్యక్షతన పాలకవర్గం సమావేశంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వెంకటేశం, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, హమాలీ సంఘాల నేతలు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచి రాష్ట్రంలో కరోనా యాంటీజన్ పరీక్షలు