Gaddam Prasad Kumar Nomination Today : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. బుధవారం రోజు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే బరిలో నిలిచారు. మిగతా పార్టీలేవీ తమ అభ్యర్థులను నిలపలేదు. గడ్డం ప్రసాద్ కుమార్‌కు కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. ఎంఐఎం సైతం తమ మద్దతును ప్రకటించింది. స్పీకర్ ఎన్నికను ఈరోజు అధికారికంగా ప్రకటిస్తారు. ఇవాళ ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభంలో గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.
కాంగ్రెస్ తరఫున బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో గడ్డం ప్రసాద్ కుమార్ సభాపతి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కూనంనేని సాంబశివరావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొన్నారు. అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి, ప్రతిపక్షం నుంచి కేటీఆర్ గడ్డం ప్రసాద్‌ను ప్రతిపాదిస్తూ నామినేషన్‌పై సంతకం చేశారు. సీఎల్పీ సమాచారంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉన్నారు.
Telangana Assembly Speaker Election 2023 : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌కు ప్రతిపక్షాలు సైతం మద్దతివ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. సభాపతిగా ప్రసాద్ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్ ఆయనే కానుండడం విశేషం. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నేడు గడ్డం ప్రసాద్ పేరును అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించి శాసనసభ సమావేశాలను ప్రారంభించనున్నారు.
తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం
Telangana Legislative Assembly 2023 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈనెల 9న మూడో శాసనసభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు శాసనసభలో సీనియర్ నేత ఎంఐఎం అధ్యక్షుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్(Protem Speaker)గా వ్యవహరించారు. ముందుగా ఆయన రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శాసనసభలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 100 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు.
మంత్రులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీలుగా రాజీనామా చేయకపోవడం వల్ల ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయలేదు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో 101 మంది మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గైర్హాజరయ్యారు. మరోవైపు బీఆర్ఎస్లో కొంతమంది కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 ఎన్నికల్లో 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షం సీపీఐతో కలిసి 65 స్థానాల్లో గెలుపొందగా, బీఆర్ఎస్ 39 స్థానాల్లోనూ, బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించింది.