వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్ నగరానికి వలస వచ్చి చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుని జీవనం సాగిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా రహదారుల వెంబడి ఫర్నిచర్ సామగ్రి అమ్మకాలు చేస్తుంటారు. హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాతో పాటు ఇలాంటి గృహోపకరణాలు, ఫర్నిచర్ కొనుగోళ్లు పెరిగాయి. దీని వల్ల వ్యాపారులు కూడా రూ.లక్షల్లో అప్పులు తెచ్చుకుని వినియోగదారులకు సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నారు.
కరోనా వల్ల మా బతుకులను తలకిందులు
లాక్‌డౌన్ కారణంగా ఒక్క సారిగా వీరి జీవితాలు తలకిందులయ్యాయి. ప్రజలెవరూ బయటకు రాక, అమ్మకాలు జరగక తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు రుణదాతలు తీసుకున్న అప్పులు కట్టమని ఒత్తిడి చేయగా దుకాణాలు మూసివేసి సొంతూళ్లకు వెళ్లి కూలి పని చేసుకుంటూ జీవితం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుంటే తప్ప వేరే దారి లేదని చేసిన అప్పులకు చావే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరుకు అమ్ముడుపోక... అప్పులు కట్టలేక
లాక్‌డౌన్ సడలింపుతో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు చేసేందుకు వినియోగదారులు దుకాణాల వద్దకు వస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేక రోజు వారి పరిస్థితి కూడా దుర్భరంగా మారింది. వారం తిరిగే సరికి రూ. వేలల్లో వాయిదాలు చెల్లించాల్సి రావడం వల్ల అధిక వడ్డీలకు బయట అప్పులు చేసి వాయిదాలు చెల్లిస్తున్నారు. మరో వైపు వీరికి షాపులు పెట్టుకునేందుకు అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రి సమయం ఇవ్వకుండా దుకాణాలను కూల్చివేస్తున్నారు. ఉన్న సామాగ్రి ధ్వంసమై రోడ్డున పడుతున్నామంటూ దుకాణాదారులు వాపోతున్నారు. ప్రజలకు అందుబాటు ధరల్లో అన్ని వస్తువులు అందిస్తున్నా అధికారులు తమపై ఏమాత్రం దయ చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.