ఆర్టీసీ ఐకాస తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్ష కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ట్యాంక్‌బండ్ చేరుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులు వేల సంఖ్యలో తరలివచ్చారు. పోలీసుల కంచెలను దాటుకుని ట్యాంక్‌బండ్‌పైకి చేరుకున్న వందలాది మంది ఆర్టీసి కార్మికులు, విపక్ష పార్టీల కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతల నినాదాలతో పరిసరాలు మారుమోగాయి.
ఎక్కడికక్కడే ముఖ్యనాయకుల గృహనిర్బంధం...
ఉదయం నుంచే ఆర్టీసీ ఐకాస నేతలతో పాటు అఖిలపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. అనేక మంది ముఖ్యనేతలను గృహ నిర్బంధం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రులు డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్‌ను తమ నివాసాల్లోనే నిర్బంధించారు.
నేతల అరెస్టుల పర్వం...
ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చిన ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని లిబర్టీ కూడలి వద్ద అరెస్టు చేయగా... ఎంపీ బండి సంజయ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ వివేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అజ్ఞాతంలో ఉన్న తెజస అధ్యక్షుడు కోదండరామ్, చాడ వెంకట్‌రెడ్డితో పాటు భారీ సంఖ్యలో వచ్చిన తెజస శ్రేణులను ఇందిరాపార్క్‌వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒక్కసారిగా ఉద్రిక్తం...
మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉన్న ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు ఒకటిన్నర ప్రాంతానికి ఆర్టీసీ కార్మికులు ఒక్కసారిగా ట్యాంక్ బండ్ మీదకు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. లిబర్టీ, లోయర్ ట్యాంక్‌బండ్, వెంకటస్వామి విగ్రహం వెనుక నుంచి భారీ ఎత్తున ఆందోళనకారులు రావటం వల్ల పోలీసులు... లాఠీలకు పనిచెప్పారు. కార్మికులు విడతల వారిగా ఒక్కోదారి నుంచి తరలిరావటం వల్ల పోలీసులు వారిని నివారించలేక... గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రెచ్చిపోయిన నిరసనకారులు రాళ్లు, చెప్పులతో విరుచుకుపడ్డారు.
గాయాలతో కార్మికులు...
పోలీసుల లాఠీఛార్జ్‌లో వందల మంది కార్మికులు గాయపడ్డారు. పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ స్థానిక ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగింటి వరకు సాగిన గందరగోళ వాతావరణం... ఆ తర్వాత ముగిసిపోవటం వల్ల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం