Telangana Secretariat Mosque: సాంకేతిక సదుపాయాలతో రూపకల్పన చేసి సచివాలయ నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత భవనాల్లో సరైన సదుపాయాలు, అగ్నిమాపక నిరోధక వ్యవస్థ లేదని పాత సచివాలయాన్ని కూల్చి.. నూతన సచివాలయ నిర్మాణానికి తెరలేపింది. పాత భవనాన్ని కూల్చే ప్రక్రియలో సచివాలయంలోనే ఉన్న ఆలయం, మసీదు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్... ఆలయం, మసీదులను ప్రభుత్వ ఖర్చుతో మరింత విశాలంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
మసీదు నిర్మాణ పనులు ప్రారంభం
ఈ నేపథ్యంలోనే కొత్త సచివాలయ ప్రాంగణంలో మసీదుల నిర్మాణపనులను (Foundation For Mosque at Secretaria) ప్రారంభించారు. టర్కీలోని మసీదు తరహాలో కొత్త సచివాలయ ప్రాంగణంలో మసీదులను నిర్మిస్తున్నామని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ చెప్పారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్న రాష్ట్ర నూతన సచివాలయ ప్రాంగణంలో రెండు మసీదుల నిర్మాణాలకు గురువారం పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని జామియా నిజామియా ఉర్దూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. గతంలో 700 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు మసీదులు ఉండేవని, సీఎం కేసీఆర్ వాటి కోసం ప్రస్తుతం 1,500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారని వివరించారు. రూ.2.90 కోట్లతో చేపట్టిన మసీదుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారని, మహిళలు నమాజు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రి, దానం నాగేందర్, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మహ్మద్ సలీం, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, నేతలు ముహ్మద్ ఫరీదుద్దీన్, రహీముద్దీన్ అన్సారీ, కరీముద్దీన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులు షేక్ జామియా, ముఫ్తీ గియాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: హరిత భవనంగా నిలువనున్న సచివాలయం!