Telangana Congress Former MPs fires On Modi: రాష్ట్రంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మాజీ ఎంపీలు ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీల మద్దతుతోనే ఆనాడు యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తలుపులు మూసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని మోదీ తప్పుబట్టడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. కాంగ్రెస్ మాజీ ఎంపీలు ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో చట్టబద్ధంగా అమలు చేయాల్సిన విభజన హామీల విషయంలో.. కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతోందని కాంగ్రెస్ మాజీ ఎంపీలు ధ్వజమెత్తారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, నాలుగు మండలాల బదలాయింపు లాంటి అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని పరిష్కరించేందుకు భాజపా ఎంపీలతో పాటు తెరాస ప్రభుత్వం కూడా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు కాంగ్రెస్ ఎంపీల పోరాటాన్ని అర్థం చేసుకున్న సోనియగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్ లాంటి వారి కృషి వల్లనే రాష్ట్రం ఏర్పాటైందని.. కేసీఆర్ దీక్ష వల్ల కాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు సురేశ్ షెట్కార్, పొన్నం ప్రభాకర్, రాజయ్య, అంజన్‌కుమార్ యాదవ్, బలరాంనాయక్‌లు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: ప్రధాని.. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం సరికాదు: గంగుల కమలాకర్