Former Supreme Court Judge Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమిస్తూ... రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిష్టాత్మకమై అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జీల బెంచ్ లో అబ్దుల్ నజీర్ ఒకరు. ఇటీవలే ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్ధానంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించిన అబ్దుల్ నజీర్... మంగళూరులో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2003 మే నెలలో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా అవకాశం దక్కించుకున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి పనిచేస్తుండగానే ఫిబ్రవరి 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు పదోన్నతి లభించింది.
ట్రిపుల్ తలాక్ చెల్లదని 2017లో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ నజీర్ కూడా ఒకరు. ఇక 2019లో అయోధ్య రామజన్మభూమి కేసు తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోనూ జస్టిస్ నజీర్ ఉన్నారు. అయోధ్యలో వివాదాస్పద ప్రాంతంలో హిందూ నిర్మాణం ఉనికి ఉందంటూ.. భారత పురావస్తు శాఖ ఇచ్చిన తీర్పును జస్టిస్ నజీర్ సమర్థించారు. ఈ ఏడాది జనవరి 4నే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ నజీర్ ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా సిఫారసు చేయగా ..రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు.
గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ నజీర్ నాయకత్వంలో ఏపీ మరింత పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడంలోనూ, రాష్ట్రానికి చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ఆయన న్యాయ నిపుణత ఉపయోగపడుతుందని సీఎం ఆకాంక్షించారు.
గవర్నర్‌గా నియమితులైన ఎస్.అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చిత్తశుద్ధి, నిజాయితీ గల వ్యక్తిగా పేరుగాంచిన ఆయన మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో ఖచ్చితంగా ముందంజలో ఉంటారని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తన పదవిలో ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: