కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు నంది ఎల్లయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. జులై 29న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పది రోజులుగా అస్వస్థతతో చికిత్స పొందుతుండగా... పరీక్షల అనంతరం కరోనాగా నిర్ధరణ అయింది. దేశంలో చాలా కీలకమైన కాంగ్రెస్ నేతల్లో నంది ఎల్లయ్య ఒకరు. 6 సార్లు లోక్‌సభకు, 2 దఫాలు రాజ్యసభకు ఎన్నికైన నంది ఎల్లయ్య.. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు.
ఓటమి ఎరుగని నేత..
నంది ఎల్లయ్య ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సిద్దిపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి 6వ, 7వ, 9వ, 10వ, 11వ లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటిచేసి.. మంద జగన్నాథ్‌ను ఓడించి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నాయకుడిగా పేరు పొందారు. కొన్నాళ్లు శాసనమండలి సభ్యుడిగానూ సేవలందించారు.
అంతకు ముందు 2014 వరకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం..
నంది ఎల్లయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాంగ్రెస్ నేతల సంతాపం..
మరోవైపు నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కుంతియా, భట్టి, పొన్నం, పొన్నం ప్రభాకర్, వి.హనుమంతరావు, సంపత్‌లు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో పార్టీ పతాకం అవనతం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
నంది ఎల్లయ్య మరణం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రానికి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. ఎల్లయ్య పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి.. క్రమశిక్షణతో పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన క్రమశిక్షణ నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
ఇదీచూడండి: కుషాయిగూడ చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్