అవినీతి రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఓల్డ్ బోయినపల్లి హస్మత్‌పేట్‌కు చెందిన బల్గు కస్తూరి, కృష్ణ దంపతుల కుమార్తెలు సుధారాణి, లక్ష్మి విజ్ఞప్తి చేశారు. తమ తల్లిదండ్రులు 1999లో తిరుమలగిరి మండల పరిధిలోని సర్వే నెంబర్ 57/2 లో 6,427 గజాల స్థలాన్ని విమలబాయ్ అనే మహిళ వద్ద నుంచి కొనుగోలు చేశారన్నారు. న్యాయవాది నుంచి సలహాలు తీసుకుని స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వారు హైదరాబాద్‌లో తెలిపారు.
50 వేలు ఇస్తేనే..
సదరు స్థలంలో ఇంటి నిర్మాణానికి మండల కార్యాలయంలో ఎన్‌ఓసి కోసం తమ తండ్రి బల్గు కృష్ణ దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. 50 వేల రూపాయలు ఇస్తేనే ఎన్‌ఓసీ ఇస్తామని మండల అధికారులు డిమాండ్ చేశారని ఆరోపించారు. మండల రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్‌ను మార్చి ఆ స్థలం ప్రభుత్వానిదేనని తమను వేధిస్తున్నారని వాపోయారు. తన తండ్రి కృష్ణ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. అయినా తిరుమలగిరి మండల అధికారి తమను ఇబ్బంది పెడుతూనే ఉందని ఆరోపించారు. కలెక్టర్‌ను ఆశ్రయించామని, అక్కడ కూడా న్యాయం జరగలేదని చెప్పారు. విసిగి వేసారిన తమ తండ్రి ఆత్మహత్యకు యత్నించగా అప్పటి అధికారులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఆ తర్వాత మరిచారని వివరించారు.
తండ్రి శవాన్ని తీసుకుని...
తీవ్ర మానసిక వేదనతో తమ తండ్రి గుండెపోటుతో మృతి చెందారని వారు పేర్కొన్నారు. తండ్రి శవంతో మండల కార్యాలయం ముందు ధర్నా చేయగా ఆర్టీఓ చంద్రకళ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మూడురోజుల అనంతరం వెళ్లి విషయంపై ఆరా తీయగా తాము ఏమి చేయలేమని చెబుతున్నారని వాపోయారు. న్యాయం కోసం 20 ఏళ్లుగా పోరాటం చేస్తునే ఉన్నామని, నేటికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్‌నోట్ కాదు... తెరాసకు మరణ శాసనం'