మన ఇళ్లల్లో కూరలో వేసే అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ మొదలుకుని కొత్తమీర దాకా... అన్ని పంటలూ ఇతర రాష్ట్రాల రైతులు పండించినవే కావటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రజల నిత్య ఆహారానికి వినియోగించే ఆహారోత్పత్తుల పంటలపై అధ్యయనం చేసిన... ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఏడాదికి రాష్ట్ర ప్రజలకు ఎంత ఆహార పంటలు అవసరం? రాష్ట్రంలో గతేడాది పండినదెంత? ఇంకా ఎంత కొరత ఉందనే లెక్కలు ఇందులో వివరించింది. వీటి ఆధారంగా ప్రస్తుతం వానాకాలం నుంచి పంటల సాగులో సమూల మార్పులు తేవాలని ప్రభుత్వం... వ్యవసాయ శాఖకు తాజాగా సూచించింది. ఈ నివేదికను అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు వ్యవసాయ శాఖ పంపింది. ఆయా జిల్లాల్లో సాగవుతున్న పంటలేంటి? కొరత ఉన్న వాటిని పండించడానికి అనువైన భూములు ఎక్కడ ఉన్నాయనే కోణంలో అధ్యయనం చేయాలని డీఏవోలకు సూచించింది. కొరత ఉన్న పంటలను పండించడానికి రైతులను చైతన్యపరచాలని నిర్ణయించింది.
మనమెందుకు పండించలేక పోతున్నాం...
నిత్యం అవసరమయ్యే కొత్తిమీర, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, అల్లం, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలను కూడా పండించలేకపోవడాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అనువైన భూములు, మంచి వాతావరణం, సాగు నీటి లభ్యత ఉన్నా... వీటిని పండించలేకపోడానికి గల కారణాలపై వ్యవసాయ, ఉద్యాన శాఖలను వివరాలు అడిగింది. పామాయిల్ తయారీ కోసం... ఉపయోగించే ఆయిల్‌పాం తోటలు పెద్ద ఎత్తున కొత్త ప్రాంతాల్లో సాగు చేయడానికి రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ వివరించింది. కొత్తగా వనపర్తి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నిర్మల్, మంచిర్యాల వంటి జిల్లాల్లోను... ఆయిల్‌పాం సాగుకు అనువైన భూములు ఉన్నట్లు తెలిపింది. చుట్టు పక్కల ప్రాంతాల రైతుల్లో ఆసక్తి కల్పించడానికి నేరుగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తి జిల్లాలో తన క్షేత్రంలోనే ఆయిల్‌పాం తోట కొత్తగా సాగు ప్రారంభించారు. ఇతర దేశాల నుంచి వంట నూనెల దిగుమతులకే.. ఏటా 70 వేల కోట్ల రూపాయలను దేశం వెచ్చిస్తోంది.
ఎంత అవసరం... ఎంత పండాయి
రాష్ట్రంలో ఏడాదికి మన అవసరాల కోసం కావాల్సిన పంట ఎంత?.. మనకు ఎంత సాగవుతుందనే అంశాలను నివేదికలో నిశితంగా వివరించారు. రాష్ట్ర ప్రజలకు ఏడాదికి 90 లక్షల టన్నుల వరి ధాన్యం అవసరం అవుతుండగా.. గతేడాది 1.93కోట్ల టన్నుల పంట వచ్చింది. పప్పు ధాన్యాలకు సంబంధించి ఏడాదికి 11 లక్షల 68 వేల టన్నులు అవసరం అవుతుండగా... గతేడాది 5 లక్షల 58 వేల టన్నులను మాత్రమే పండించాం. వంట నూనెల విషయంలో సంవత్సరానికి 4 లక్షల 40 వేల టన్నులు అవసరం అవుతుండగా.. గత సంవత్సరం 88 వేల 500 టన్నులు మాత్రమే చేతికి వచ్చింది. ఇక కూరగాయల విషయంలో ఏడాదికి 47 లక్షల 44 వేల టన్నులు కావాల్సి ఉండగా .. నిరుడు 28 లక్షల 4 వేల టన్నులు మాత్రమే మార్కెట్లకు వచ్చింది. పండ్లకు సంబంధించి ఏడాదికి 18 లక్షల 24 వేల టన్నులు మాత్రమే అవరసం అవుతుండగా... పోయిన ఏడాది 41 లక్షల 97 వేల 200 టన్నులు పండాయి. ఇక ఉల్లిగడ్డ 5 లక్షల 88 వేల టన్నులు అవసరమవ్వగా కేవలం 2 లక్షల 67 వేల టన్నులు మాత్రమే పండించారు. మిరప 38 వేల 800 టన్నులు కావాల్సి ఉండగా... నిరుడు లక్షా 26 వేల టన్నులు పండించారు. పసుపు 23 వేల 440 టన్నులు మాత్రమే అవసరం అవుతుండగా... 3 లక్షల 7 వేల టన్నుల పంట వచ్చింది. అల్లం పంట విషయంలో 69 వేల 600 టన్నులు ఏడాదికి అవసరం అవుతుండగా... నిరుడు 11 వేల 40 టన్నులు మాత్రమే పండించారు. ఇక వెల్లుల్లి విషయంలో పెద్ద వ్యత్యాసమే ఉంది. మనకు 40 వేల టన్నుల పంట అవసరం అవుతుండగా... గత ఏడాది మన రైతులు కేవలం 470 టన్నులే మార్కెట్‌కు తెచ్చారు.
ప్రభుత్వ చర్యలు
ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రజలు అవసరాలు తీర్చేలా అన్ని పంటలను ఇక్కడే పండించడానికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని... రైతుల్లో అవగాహన పెంపొందించడానికి సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలని వ్యవసాయ శాఖ కసరత్తులు చేస్తోంది. మరో వారం పది రోజుల్లో ఈ విధానంపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి:'వలస కార్మికుల తరలింపులో చొరవ తీసుకోండి