బుధవారం వేకువజామున జూరాల గేట్లను మూసివేశారు. ఆ సమయంలో ప్రవాహం 48 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఉదయం ఏడున్నరకు వరద ఒక్కసారిగా 1,29,588 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో గేట్లు తెరిచి 81,416 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తితో 33,020 క్యూసెక్కులను శ్రీశైలం వైపు విడుదల చేయడం ప్రారంభించారు. తొమ్మిది గంటలకు ప్రవాహం 50 వేల క్యూసెక్కులకు పడిపోవడంతో గేట్లు మూసివేశారు. సాయంత్రం ఆరు గంటలకు మళ్లీ ప్రవాహం పెరగడంతో అయిదు గేట్లు తెరిచి 20,890 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయానికి వరద క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర జల సంఘం తెలిపింది. ఎగువ నుంచి 40 వేల క్యూసెక్కులు వస్తుండగా 14 గేట్లు తెరిచి జూరాల వైపునకు 1.22 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 123 టీఎంసీలకు చేరుకుంది. తెలంగాణ విద్యుదుత్పత్తి యూనిట్ల ద్వారా 40,259 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ప్రాణహితకు భారీగా పెరిగిన ప్రవాహం
కాళేశ్వరం, మహదేవ్‌పూర్, న్యూస్‌టుడే: కాళేశ్వరం వద్ద ప్రాణహిత ప్రవాహం బుధవారం భారీగా పెరిగింది. 8.8 మీటర్ల (30 అడుగులు) నీటి మట్టంతో దిగువకు ప్రవహిస్తోంది. కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ వద్ద 2.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజికి భారీగా వరద వస్తోంది. మొత్తం 57 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 4,46,200 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 4,30,600 క్యూసెక్కులను దిగువకు వదిలారు. బ్యారేజీ 3§సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను నీటి నిల్వ 11.40 టీఎంసీలకు చేరింది.
గోదావరి పరవళ్లు
భద్రాచలం, అశ్వాపురం, న్యూస్‌టుడే: ఎగువ జలాశయాల నుంచి నీటి విడుదల, వర్షాల కారణంగా గోదావరి పరవళ్లు తొక్కుతోంది. బుధవారం సాయంత్రం భద్రాచలం వద్ద నీటి మట్టం 29.5 అడుగులకు చేరింది. పర్ణశాల రామాలయం వద్ద స్నానఘట్టాలు, ప్లాట్‌ఫాంలు నీటమునిగాయి. చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులో 6 గేట్లు ఎత్తి 9,498 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. బుధవారం కురిసిన భారీ వర్షానికి సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువతో పాటు భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు ఫేజ్-1 పంప్‌హౌస్‌లోకి భారీగా నీరు చేరింది.
1.20 కోట్ల ఎకరాల్లో సాగు
రాష్ట్రంలో పంటల సాగు రికార్డుస్థాయిలో 16 శాతం పెరిగింది. వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్) సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం కోటీ 3 లక్షల ఎకరాలకు గాను బుధవారం నాటికి అదనంగా 16 శాతం పెరిగి కోటీ 20 లక్షల ఎకరాలు దాటింది. గతేడాది ఈ సమయానికి 80.02 లక్షల ఎకరాలే సాగవగా ఈసారి అంతకన్నా 40 లక్షల ఎకరాలు పెరిగింది. వనపర్తి, సూర్యాపేట, ములుగు జిల్లాలు తప్ప మిగతాచోట్ల వంద శాతానికి మించి విస్తీర్ణంలో విత్తనాలు, నాట్లు వేయడం విశేషం.
![](https://assets.eenadu.net/article_img/12main17b_2.jpg)