భారీ వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందుకు కారణం సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే అంటున్నారు నిపుణులు. మహానగరంలో ముంపు నివారణకు కమిటీల మీద కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ వాటి నివేదికల ఆధారంగా రాజధానిలో నాలాల వ్యవస్థను సంస్కరించే పనిని అధికారులు చేపట్టలేకపోయారు. దీంతో ఏటా నగరం జలవిలయంలో చిక్కుకుపోతోంది.కోటిమంది జనాభా ఉన్న రాజధానిలో నిజాం కాలంలో నిర్మించిన నాలాలే ఉన్నాయి. అప్పట్లో వంద అడుగుల వెడల్పుతో ప్రధాన నాలాలు నిర్మించగా అవి చాలాచోట్ల ఆక్రమణల పాలయ్యాయి. వీటి ఆధునికీకరణ కానీ, విస్తరణ కానీ జరగలేదు.
- 2000లో వరదల అనంతరం అప్పటి ప్రభుత్వం క్లిరోస్కర్ కమిటీకి నాలాల సంస్కరణలపై నివేదికను ఇచ్చే బాధ్యతను అప్పగించింది. రాజధానిలో 1,221 కిలోమీటర్ల పొడవున నాలాలు ఉంటే అందులో 390 కిమీ పొడువున మేజర్ నాలాలున్నాయి. ఈ కమిటీ 2003లో నివేదికను ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న నాలాల మీద 28,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని వీటిని తొలగించి విస్తరణ పనులు చేపట్టడానికి రూ. 10 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇన్ని నిర్మాణాలను తొలగించడం సాధ్యం కాదని అప్పట్లో అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టింది.
- 2007లో మళ్లీ నాలాల సంస్కరణ మీద నివేదికను ఇచ్చే బాధ్యతను ఓయన్స్ సంస్థకు అప్పగించారు. ఈ కమిటీ కూడా క్లిరోస్కర్ తరహాలోనే నివేదికను ఇచ్చింది.
- రెండేళ్ల కిందట జేఎన్‌టీయూ నిపుణులు నాలాలను విస్తరించడంతోపాటు వరదనీరు నగరం మీద పడకుండా ఉండటం కోసం కొన్నిచోట్ల కృత్రిమంగా చెరువులను తవ్వాలని సూచించారు. దీనికి రూ.4,900 కోట్ల మేర అవుతుందని అంచనా వేశారు. అది కూడా కార్యరూపం దాల్చలేదు.
- రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీర్లతో కమిటీ వేసింది. వరద నీరు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్న ప్రాంతాల్లో తక్షణం ఆక్రమణలను తొలగిస్తే కొంతమేర ఫలితం ఉంటుందని ఆ కమిటీ తేల్చి చెప్పింది. 12,800 అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరింది. దీనికి రూ.12,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. మొదటి దశలో రూ. 230 కోట్లతో కొన్ని కీలక ప్రాంతాల్లో అక్రమణలను తొలగించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో 20 శాతం పనులు మొదలయ్యేటప్పటికి కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో ఈ విస్తరణ పనులు ముందుకు సాగలేదు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం