Highest Run Chase At MCG In Test : భాఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా భారత్ నాలుగో టెస్టు ఆడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 228/9 స్కోరుతో నిలిచింది. దీంతో 333 పరుగుల లీడ్ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేయగా భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. దీంతో బాక్సింగ్ డే టెస్టులో టీమ్‌ఇండియాకు భారీ లక్ష్యమే ఎదురైంది. సోమవారం ఆటకు చివరి రోజు. ఆట కూడా షెడ్యూల్ కంటే అర్ధ గంట ముందే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 4.30 గంటలకు మొదలవుతుంది. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే దాదాపు 96 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఓ రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. ఈ క్రమంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టెస్టుల్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంత? భారత్ మెల్బోర్న్లో ఎన్ని సార్లు సక్సెస్‌ఫుల్‌గా రన్ ఛేజ్ చేసింది? అవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హైయ్యెస్ ఛేజింగ్ రికార్డు
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ 1928లో 332 పరుగులను లక్ష్యాన్ని ఛేదించింది. ఇదే మెల్బోర్న్లో అత్యధిక పరుగుల ఛేజింగ్. ఇప్పటివరకు మెల్బోర్న్లో జరిగిన టెస్టుల్లో ఇంగ్లాండ్ (8), ఆసీస్ (21) సార్లు విజయంతంగా ఛేజింగ్ చేశాయి. 1953లో దక్షిణాఫ్రికా ఒకసారి 297 పరుగుల లక్ష్యాన్ని సక్సెస్ ఫుల్‌గా ఛేదించింది.
రెండు జట్లే
ఉపఖండంలోని జట్ల విషయానికొస్తే, 2020 డిసెంబర్లో ఆసీస్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 70 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 2008లో దక్షిణాఫ్రికా183 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోయి ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మినహా ఉపఖండంలోని ఇంకే జట్లు ఛేజింగ్‌లో మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో గెలవలేదు.
రెండు సార్లు మాత్రమే
కాగా, ఇప్పటివరకు ఆసీస్ పిచ్‌లపై రెండు మాత్రమే టీమ్ఇండియా 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 2021 జనవరిలో జరిగిన చారిత్రక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన టెస్టులో 328 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. ఆలాగే 2003లో జరిగిన ఆడిలైడ్ టెస్టులో టీమ్ఇండియా 230 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.
బోర్డర్- గావస్కర్లో
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ చరిత్రలో 19 విజయవంతమైన రన్ ఛేజ్‌లు జరిగాయి. అందులో భారత్ 12 సార్లు భారత్, 7 సార్లు ఆసీస్ ఛేజింగ్ చేశాయి. టాప్- 11 రన్ ఛేజింగ్‌లలో తొమ్మిది భారత్‌వే కావడం విశేషం. ఆస్ట్రేలియాలో భారత్ 200 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని ఒకసారి, 300 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని ఒకసారి ఛేదించింది.
'కమాన్, ఇప్పుడు అరవండి రా!'- కొన్‌స్టాస్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా సంబరాలు