ఎంబీటీ ( మజ్లీస్ బచావో తెహారిక్ ) పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను వరద బాధితులు ఆశ్రయించారు. ఇటీవల కురిసిన వర్షం వల్ల మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని ఉస్మాన్‌నగర్, అహ్మద్‌నగర్, సైఫ్ కాలనీలలో ఇప్పటికి నీరు నిలిచి ఉందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. వరద నీటి వల్ల వెయ్యి కుటుంబాలకు పైగా ఇబ్బందులు పడుతున్నాయని కమిషన్‌కు వివరించారు.
ప్రభుత్వం ప్రకటించిన 10 వేల ఆర్థిక సహాయం అందించకుండా, తమ బస్తీలలో నిలిచిన వర్షం నీటిని తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కమిషన్‌ను కోరారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక్కసారి వచ్చి వెళ్లినప్పటికి... ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా వరద నీటిలో ఉండడంతో పిల్లలకు, తమకు రోగాలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం బాధితులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని బాధితుల తరఫున ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్ హెచ్చార్సీను కోరారు.