హైదరాబాద్‌లో వరద ముంపు(Flood threat) నివారణా ప్రణాళికలు... ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు చేయటంలో ఉదాసీనత కనిపిస్తోంది. టెండర్లు పూర్తై నెలలు అవుతున్నా... పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోవటంలేదు. అధికార యంత్రాంగం తీరుతో... వర్షాకాలమంటేనే హైదరాబాదీలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. గత ఏడాది వానకాలంలో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురిసిన వర్షానికి నగరమంతా అల్లకల్లోలమైంది.
వరద ముంపు
సరూర్‌నగర్ చెరువు కింద ఉన్న ప్రాంతాలు నీటమునిగాయి. గడ్డి అన్నారం, లింగోజిగూడ, చంపాపేట, చైతన్యపురి డివిజన్ పరిధిలోని 200కుపైగా కాలనీలుండగా... వీటిలో 70 నుంచి 80 కాలనీలకు వరద ముంపు పొంచి ఉంది. సరూర్‌నగర్ చెరువుకు ఎగువన ఉన్న మహేశ్వరం, మీర్‌పేట, బడంగ్‌పేట్, బాలాపూర్, బైరామల్‌గూడ చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. అక్కడి వరద నీరంతా... సరూర్‌నగర్ చెరువులోకి వచ్చి చేరుతుంది. ఒకప్పుడు 125 ఎకరాలున్న సరూర్‌నగర్ చెరువు... ప్రస్తుతం 30 ఎకరాలకు తగ్గిపోయింది. నాలాల్లో పూడిక తొలగించకపోవటం, ఎగువ నుంచి వచ్చే ఏడు చెరువుల నీరు కలవటంతో... ఓవర్ ఫ్లో అవుతోంది.
అక్రమ కట్టడాలు
గతేడాది వరద బీభత్సంతో సరూర్‌నగర్ మండలం కోదండరాం నగర్ కాలనీలో నాలుగేళ్ల బాలుడు, మరో వృద్ధుడు నీటిలో కొట్టుకుపోయారు. మరో వ్యక్తి రోడ్డు దాటుతుండగా వాహనంతో సహా... చెరువులో పడిపోయాడు. చాలా కుటుంబాలు రోజుల తరబడి నీళ్లలోనే కాలం వెళ్లదీశాయి. భూగర్భ మురికి కాల్వల లైన్లు కలపటం, నాలాలు పునరుద్ధరణ చేయకపోవడం, అక్రమ కట్టడాల వల్ల చెరువు పొంగి... కాలనీలను ముంచెత్తోంది. వరద ముంపు ఎదుర్కొనే కాలనీల్లోని ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉందని.. ఆస్తులకు డిమాండ్ కూడా పడిపోయిందని స్థానికులు వాపోతున్నారు.
దస్త్రాలకే పరిమితం
సరూర్‌నగర్ లోతట్టు ప్రాంతాల్లో వరద బీభత్సంతో సంబంధిత అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది. లక్షల్లో ఆస్తి నష్టం జరగగా... 10వేల రూపాయల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాల్వల అభివృద్ధి, నాలాలు విస్తరణ, బాక్స్ డ్రైన్లు లాంటివి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కానీ, అవన్నీ దస్త్రాలకే పరిమితమయ్యాయి. అధికారుల ఉదాసీనతతో ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. నాలుగు డివిజన్ల పరిధిలో దాదాపు రెండు లక్షల కుటుంబాలు వరద ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
ప్రధాన రహదారుల వెంబడి ట్రంక్ లైన్లతో వరద నీరు మూసీలోకి మళ్లించటంతో శాశ్వత పరిష్కారం లభించే అవకాశముంది. ఈ దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తే... రాబోయే రోజుల్లో ముంపు నుంచి కాపాడే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: PIL IN HIGHCOURT: అడ్డగూడూరు కస్టోడియల్ మృతిపై హైకోర్టులో పిల్