Record Electricity Demand In Telangana: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయానికి 14వేల 649 మెగా వాట్ల డిమాండ్ నమోదు అయినట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత విద్యుత్ వినియోగం నమోదు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు స్పష్టం చేశారు.
శుక్రవారం 14వేల 169 మెగా వాట్ల విద్యుత్ వినియోగం నమోదుకాగా.. ఇవాళ అంతకు మించి 14వేల 649 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా పెరుగుతున్న ఉష్టోగ్రతలకు తోడు.. వ్యవసాయ నాట్లు ముగింపు దశలో ఉండడం, మొదట్లో వేసిన పంటలు ఏపుగా పెరగడంతో నీటి వినియోగం భారీగా పెరిగిపోయింది.
Electricity Demand In Telangana: ఉద్యానవన పంటలకు సైతం నీటి వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ఎక్కువ శాతం బోరుబావులపై ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు. వీటి కారణంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇంతకు ముందు వ్యవసాయానికి 35శాతం మాత్రమే విద్యుత్ ను వినియోగించగా.. ప్రస్తుతం ఆ వినియోగం 37శాతానికి పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఇటీవలి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ వినియోగం 6వేల 666 మెగా వాట్లు మాత్రమే ఉండేదని అధికారులు అంటున్నారు. రానున్న రోజుల్లో 15 వేల మెగా వాట్ల విద్యుత్ వినియోగం నమోదు అయ్యే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేశారు. ఎంత డిమాండ్ వచ్చిన నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
వేసవిరాక ముందే విద్యుత్ వాడకం చుక్కల్లో: వేసవికాలం రాకముందే విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. గతేడాది ఫిబ్రవరి 10న డిమాండ్ 11వేల 822 మెగావాట్లు మాత్రమే. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14వేల 167 మెగావాట్లు నమోదు కాగా తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. వ్యవసాయ బోర్లకు కొద్దిరోజులుగా త్రీఫేజ్ కరెంటు 10 గంటలలోపే ఇస్తున్నారు.
శుక్రవారం నుంచి 12 గంటలకు సరఫరా పెంచడంతో డిమాండ్ కూడా పెరుగుతోంది. శనివారం నుంచి 24 గంటలూ త్రీఫేజ్ సరఫరా వ్యవసాయ బోర్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణాలతో విద్యుత్ వినియోగం ఎక్కువై డిమాండ్ చుక్కలను తాకుతున్నట్లు విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లు తెలిపాయి.
ఇవీ చదవండి: