Harish rao in council: కరోనా కష్టకాలంలో పనిచేసిన వైద్య సిబ్బందికి ఉద్యోగ నియామకాల్లో వెయిటేజ్ కల్పిస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. ద్రవ్యవినిమయ బిల్లుపై శాసనమండలిలో సభ్యుల సందేహాలకు మంత్రి సమాధానమిచ్చారు. ఉస్మానియాలో ఇటీవలే కేథలాబ్స్ను ప్రారంభించామని.. గాంధీలో కూడా త్వరలోనే ప్రారంభిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు హరీశ్ రావు సమాధానమిచ్చారు. వీటితో పాటు జిల్లా ఆస్పత్రుల్లో కూడా కేథలాబ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.
ధరణి పోర్టల్లో కొన్నింటికి ఆప్షన్స్ లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. మరిన్నీ మాడ్యూల్స్ తీసుకు రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఇప్పటికే ధరణిలో అనేక మార్పులు తీసుకొచ్చామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. శాసన మండలి నాలుగు రోజులపాటు దాదాపు 12 :25 నిమిషాల వరకు కొనసాగిందని మంత్రి చెప్పారు.
నాలుగు ప్రధాన బిల్లులు ఆమోదం
చివరి రోజు శాసనమండలిలో ఎఫ్ఆర్బీఎం పరిధి ఈ ఏడాది 4 శాతానికి.. వచ్చే ఏడాది 5 శాతానికి పెంచే చట్టసవరణ బిల్లుకు ఆమోదం లభించింది. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల సంఖ్య 8 నుంచి 12కి పెంచుతూ చట్టసవరణ బిల్లు, ద్రవ్యవినిమయ బిల్లు-1, ద్రవ్యవినిమయ బిల్లు-2కు శాసనమండలి ఆమోదం తెలిపింది.
రాకెట్ నుంచి రైతు బంధు వరకు తెలుసు: కవిత
రాకెట్ నుంచి రైతు బంధు వరకు సీఎం కేసీఆర్కు అన్ని అంశాలపై అవగాహన ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మన జీడీపీ దేశానికే తలమానికంగా ఉందని కితాబునిచ్చారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా అభివృద్ధి, ఖర్చుల కోసం 75 శాతం కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ఆలయాలను పట్టించుకోలేదని ఆరోపించారు.
ఈ ప్రభుత్వం యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, కొండగట్టులకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తోందన్నారు. ఐకేపీ, సెర్ప్, మెప్మా, ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటు.. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనం పెంచినందుకు సీఎం కేసీఆర్కు కవిత కృతజ్ఞతలు తెలియజేశారు. సభలో బిజినెస్ అడ్వైజరీపై అవగాహన కల్పించాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి కోరారు. సభలో పెట్టిన బిల్లులపై మాట్లాడేటప్పుడు ఏవిధంగా మాట్లాడాలనే అంశంపై అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: