Film And Political Celebrities Paid Tributes To Tarakaratna: నందమూరి తారకరత్న భౌతికకాయానికి.. హైదరాబాద్ శివారు మోకిలాలోని ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు.. నివాళులు అర్పిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు, ఇతర కుటుంబసభ్యులు.. తారకరత్న భౌతికకాయానికి అంజలి ఘటించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. శతవిథాలా ప్రయత్నించినా తారకరత్నను కాపాడుకోలేకపోయామని.. చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. నారా లోకేశ్ దంపతులు తారకరత్న భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. ఎంతో భవిష్యత్ ఉన్న తారకరత్న మనమధ్య లేకపోవడం తీరని లోటుగా అభివర్ణించారు. తండ్రిని తలుచుకుంటూ వెక్కివెక్కి ఏడుస్తున్న తారకరత్న కుమార్తెను చూసి.. అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.
నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సినీ ప్రముఖులు మురళీమోహన్, శివాజీరాజా, అలీ, తెలుగుదేశం నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తారకరత్న పార్ధివదేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు.. ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని సినీ నటులు గుర్తుచేసుకున్నారు. మంచి వ్యక్తి, మృదుస్వభావి అయిన తారకరత్న.. అనతికాలంలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం బాధాకరమని అన్నారు.
23 రోజులుగా.. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందిన తారకరత్న.. ఆరోగ్య పరిస్థితి విషమించి.. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా మోకిలలోని స్వగృహానికి.. తారకరత్న భౌతికకాయం తీసుకొచ్చారు. కడసారి అభిమాన నటుడు తారకరత్నను చూసేందుకు సామాన్య ప్రజలు భారీగా తరలివచ్చి శోకసంద్రంలో మునిగిపోయారు. అభిమానుల సందర్శనార్థం తారకరత్న భౌతిక కాయాన్ని సోమవారం ఫిల్మ్‌నగర్‌కి తరలించనున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబవర్గాలు తెలిపాయి.
"మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి.. ఏకకాలంలో తొమ్మిది సినిమాలు చేయడం. మొదటి సినిమాతోనే ఎంతో పేరును గడించిన వ్యక్తి తారకరత్న. అమరావతి సినిమాలో ఉత్తమ యాక్టింగ్ చేసినందుకు నంది అవార్డు అందుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి ఏదో ఒకటి చేయాలని అనుకునే వ్యక్తి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు." - చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత
ఇవీ చదవండి: