రాష్ట్రంలోని పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, మెరుగైన పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మరో విడత నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఐదో విడత, పట్టణ ప్రాంతాల్లో నాలుగో విడత ప్రగతి కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుడుతున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మేయర్లు, కలెక్టర్లు, అధికారులతో ఇప్పటికే సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్.. చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేశారు. పల్లెలు, పట్టణాల ఉన్నతస్థితి నుంచి అత్యున్నత స్థితి దిశగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలు సుఖవంతంగా ఉండాలంటే ప్రత్యేక శ్రద్ధ వహించి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల నిధుల్లో 10 శాతం బడ్జెట్ను హరితహారానికి కేటాయించాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా జరుగుతున్న అన్ని పనులను మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీరాజ్, పురపాలక శాఖలు మార్గదర్శకాలు జారీ చేశాయి. 15 రోజుల పాటు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. బాగా పనిచేసిన గ్రామాలు, పట్టణాలతో పాటు పనితీరు ఆశించిన మేర లేని వాటిని కూడా గుర్తించి హెచ్చరించారు. మొదటి రోజైన ఇవాళ గ్రామ, వార్డుసభల సమావేశాలు నిర్వహించి ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు పక్షం రోజుల పాటు చేయాల్సిన పనులను గుర్తించాలి. పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిరోజూ రహదార్లు, డ్రైనేజీలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. పాఠశాలలు, కార్యాలయాలు, తదితర సంస్థల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలి. రహదారులు, ఖాళీస్థలాల వెంట మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించాలి. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఒక రోజును ప్రత్యేకంగా కేటాయించాలి. తాగునీటి వనరులు, వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, తదితరాలకు సంబంధించి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కూడా పరిశీలించి పూర్తికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్లె, పట్టణప్రగతి పర్యవేక్షణ కోసం పంచాయతీరాజ్, పురపాలకశాఖలు ప్రత్యేక అధికారులను నియమించాయి. ఆయా ప్రాంతాల్లో పురోగతిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తీరును ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంటుంది.
నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు..: సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయనున్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో నిన్న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటివరకు చేసిన ప్రగతి పనులను వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి..