World Pulses Day: పప్పు దినుసుల పోషక, పర్యావరణ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆహారంలో భాగమైన అపరాల పంటలకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గుంటూరు జిల్లా అనేక దశాబ్దాలుగా నిలయంగా ఉంది. మినుము, పెసర, శనగ, కంది ప్రధాన అపరాల పంటలు. రబీ సీజన్ సాగులో అపరాలకు పెద్దపీట వేస్తారు.
ఖరీఫ్ సీజన్‌లో తొలకరి పంటలుగా మినుము, పెసర వేసేవారు. వరి, పత్తి వంటి పంటల సాగుకు సమయం ఉన్న తరుణంలో ముందస్తుగా ఈ పంటలను సాగు చేస్తున్నారు. కంది పంటను సైతం ఉమ్మడి జిల్లాల్లో ఖరీఫ్ కాలంలో విరివిగా పండించేవారు. గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో ఖరీఫ్‌లో ప్రధాన పంటగా వేయగా తెనాలి ప్రాంతంలో ఖరీఫ్ సీజన్‌లో వరి పంటలో మాగాణి గట్లపై కంది వేస్తుండేవారు. 1980 దశకానికి ముందు కొన్ని ప్రాంతాల్లో సోయాబీన్ సైతం సాగులో ఉండేది.
Guntur District is Home To Pulse Crops: రబీలో కృష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టు ప్రాంతంలో వరి తర్వాత రెండో పైరుగా మినుము, పెసర సాగు చేసి మంచి ఆదాయం పొందేవారు. కొన్ని సందర్భాల్లో ఖరీఫ్ వరి పంట కంటే రబీలో అపరాలు స్థిరమైన ఆదాయం ఇచ్చేవి. జిల్లాలో ఈ సంప్రదాయం అనేక దశాబ్దాల పాటు కొనసాగింది. ప్రకాశం జిల్లా సరిహద్దు మండలాల్లో రబీ సమయంలో శనగ పంటను సాగు చేస్తారు.
కాలానుగుణంగా అనేక మార్పులు వస్తున్నప్పటికీ ఈ పంటల విస్తీర్ణం తగ్గిందే తప్ప సాగు మాత్రం కొనసాగుతూనే ఉంది. సోయాబీన్ పంట నాలుగు దశాబ్దాల కిందట కోలాహాలంగా ఉండగా, ఇప్పుడు దాని సోయగం తగ్గిందనే చెప్పాలి. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాష్ట్రాల నుంచి కొత్త రకాల వ్తితనాలను తెచ్చుకుని ఇటీవల మళ్లీ సాగు మొదలెట్టి ఆదాయం అందుకుంటున్నారు.
తగ్గిన విస్తీర్ణం..: ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు దశాబ్దాల కింద వరకు మినుము పంట విరాజిల్లింది. ఒకప్పుడు ఖరీఫ్ సీజన్‌లో 2 లక్షల హెక్టార్ల వరకు వేయగా, రబీ సీజన్‌లో 1.50 నుంచి 1.60 లక్షల హెక్టార్లలో మినుము సాగైంది. ఖరీఫ్‌లో కంది పంట కూడా 40-50వేల హెక్టార్లలో పండించేవారు. గత పదేళ్ల నుంచి రైతులు జొన్న సాగువైపు మళ్లారు. అపరాలకు పల్లాకు తెగులు సమస్య కారణంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది.
దీంతో ప్రత్యామ్నాయంగా రైతులు జొన్న, మొక్కజొన్నను ఎంచుకున్నారు. వీటిసాగుతో ఆదాయం బాగున్నా భూమి నిస్సారం కావడం, ఇతర సమస్యలతో మళ్లీ రైతులు ఆలోచనలో పడ్డారు. ప్రధాన పంటలు వికటించిన సందర్భాల్లో అపరాల పైరులే రైతులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. సాగు ఖర్చులకు తగ్గకుండా మద్దతు ధరలను నిర్ణయించి మార్కెట్ పడిపోయినప్పుడు సేకరించి రైతులకు తోడ్పాటు అందించాలని వారు కోరుతున్నారు.
మారుతున్న సాగు చిత్రం: ప్రధాన పంటలైన వరి, పత్తి, మిరప పంటల్లో పెట్టుబడులు పెరిగి ఆదాయం తగ్గిపోయి నష్టాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో అపరాల పంటల సాగుకు రైతులు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీతోపాటు పొరుగు రాష్ట్రాల ప్రభుత్వ పరిశోధన సంస్థలు తీసుకువస్తున్న నూతన వంగడాలను సాగు చేస్తున్నారు. అనేక ప్రైవేటు కంపెనీలు కూడా అపరాల పైర్లలో రైతులకు అనువుగా ఉండే దేశీయ, సంకర విత్తనాలను రూపొందిస్తున్నారు.
రైతుల అభిరుచులకు అనుగుణంగా పరిశోధనల్లో మార్పులు చేస్తున్నారు. ఇటీవల అపరాల పంటల్లో వస్తున్న మార్పులు పంట కాలం తగ్గింపు అనుకూలంగా మారింది. ఒకప్పటి కంటే ఈమధ్య అన్ని అపరాల పంటల సాగు సమయం బాగా తగ్గిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఖరీఫ్ సీజన్‌లోనే సాగు చేసే కంది పంటను రబీ సమయంలో కూడా సాగు చేసేలా విత్తనాలు వస్తున్నాయి.
ఇవీ చదవండి: