ఇటీవల వర్షాలకు వరిపంట పాడవటం వల్ల ధాన్యంలో తేమ, తాలు పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర దక్కక నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రానికి తెచ్చేముందు, తెచ్చిన తరువాత ధాన్యాన్ని తూర్పారపట్టడం, ఆరబెట్టాల్సి రావడం వల్ల శ్రమ, కూలీ ఖర్చులు అధికమవుతున్నాయని వాపోతున్నారు.
గత నెలలో కురిసిన భారీ వర్షాలకు చాలాచోట్ల వరి పైరు నేలవాలింది. పొలాల్లో నీరు, తేమ ఉండడంతో కంకులు బాగా తడిసిపోయాయి. తాలు ఏర్పడటం వల్ల పంట కోసిన తరవాత ధాన్యంలో తేమ అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో వానాకాలంలో కోటీ 34 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగవడం వల్ల ఎక్కడా ఖాళీ స్థలాలు కానరాక వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు రహదారులను ఆశ్రయిస్తున్నారు. నిత్యం వాహనాలు తిరిగే తారురోడ్లపైనే ఆరబోస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలూ ఉన్నాయి.
యంత్రాలతో నూర్పిడి.. తేమ తగ్గే దారేదీ?
గతంలో కూలీలతో వరిపైరును కోయించి, 2-3 రోజులు పొలంలోనే ఆరబెట్టేవారు. కుప్పవేసి కొద్దిరోజుల తరవాత నూర్పించేవారు. అప్పటికి ధాన్యంలో తేమ తగ్గిపోయి అమ్మకానికి తీసుకెళ్లే సమయానికి నాణ్యంగా ఉండేవి. ఇప్పుడు కూలీల కొరత, అధిక కూలీరేట్లకు భయపడి యంత్రాలతో వరి కోతలు కోయిస్తున్నారు. పొలంలో బురదగా ఉన్నా ఈ యంత్రాలు పైరును కోసి నేరుగా ధాన్యాన్ని ట్రాక్టర్ ట్రాలీలో పోస్తాయి.
తేమ 17 శాతంలోపు ఉంటేనే పౌరసరఫరాలశాఖ మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. ప్రస్తుతం.. ధాన్యంలో 20 నుంచి 40 శాతం వరకూ తేమ ఉండటం వల్ల కొనుగోలు కేంద్రాల్లోనే 2 నుంచి 4 రోజుల పాటు రైతులు ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. తాలు శాతం ఎక్కువుందంటే అక్కడే మళ్లీ తూర్పార పోస్తున్నారు. ఈ కారణంగా రైతులు రోజుల తరబడి అక్కడే వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యలు తీరాలంటే పొలాల వద్ద లేక ఇళ్ల వద్ద ధాన్యాన్ని ఆరబోసి కేంద్రాలకు తేవాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో బురదగా ఉండటం, ఇళ్ల వద్ద స్థలాలు లేనందున నేరుగా ఈ కేంద్రాలకే తెస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
ఆరుగురు కూలీలతో తూర్పార పోయిస్తున్నా
వానాకాలంలో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. ఎకరానికి 10 బస్తాల ధాన్యం కౌలు కింద అప్పగించా. వరి కోత యంత్రానికి గంటకు రూ.3 వేల చొప్పున 10 గంటలకు రూ.30 వేలు చెల్లించాను. ధాన్యం అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి తీసుకుని వస్తే తేమ, తాలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఇక్కడే మళ్లీ ఆరుగురు కూలీలతో తూర్పార పోయించి ఆరబెట్టా. ఒక్కో కూలీకి రోజుకు రూ.400 చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఖర్చులు పెరిగిపోయి మిగులు ఏమీ కనపడడంలేదు.
- నిమ్మల వెంకటయ్య, అక్కనపల్లి, వలిగొండ మండలం, యాదాద్రి జిల్లా
ఇవీ చూడండి: 'చలికాలం కరోనా విజృంభణకు అనువైన సమయం'