రాష్ట్రంలో నీలి విప్లవం దిశగా సర్కారు అడుగులు వేస్తున్న తరుణంలో పలువురు రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ రాయితీలు ఉపయోగించుకుని.. సొంతంగా చెరువులు నిర్మించుకుని చేపలు పెంచుతున్నారు. యాద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో కన్నారావు అనే కౌలు రైతు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన పంటలతో పాటు చేపల పెంపకానికి శ్రీకారం చుట్టారు.
అంతగా అవగాహన లేకపోయినప్పటికీ కన్సల్టెంట్ సూచనలు, సలహాలతో చెరువు తవ్వించి చేపల పెంపకం మొదలుపెట్టాడు. 4 నెలల వ్యవధిలోనే చేపలు 750 గ్రాముల బరువు పెరిగాయి. రసాయనాలు వినియోగించుకుండా పర్యావరణహితంగా సేంద్రీయ పద్ధతిలో నాణ్యమైన కొర్రమీనులు అందిస్తున్నారు. భీమవరం నుంచి చేపల మేత దిగుమతి చేసేందుకు నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లా రైతులతో కలిసి ఓ కంపెనీతో డీలర్‌షిప్ చేసుకున్నారు. ప్రభుత్వం సకాలంలో సీడ్, ఫీడ్ అందిస్తే మరింత నాణ్యమైన ఆరోగ్యకరమైన చేపలు అందించవచ్చని రైతు కన్నారావు చెబుతున్నాడు.
నల్గొండ జిల్లా దేవరభీమనపల్లిలో రైతు విజయ్‌కుమార్ గత 12 ఏళ్లుగా తన 8 ఎకరాల విస్తీర్ణంలో కొర్రమీను చేపల పెంపకం చేపట్టి.. మత్స్య శాఖ ఇచ్చే రాయితీలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఇతర రైతులకు ఓ శిక్షకుడుగా మారాడు. రాష్ట్రంలో కొర్రమీను చేపల పెంపకానికి సంబంధించి మొదటి సర్టిఫైడ్ ట్రైనర్‌గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. చేపల పెంపకంపై ఆసక్తి గల రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడనానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
కొద్దిపాటి విస్తీర్ణంలోనే చేపల పెంపకంతో మంచి రాబడి వస్తుండటంతో మరికొంత మంది రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. పెద్ద ఎత్తున యువత ముందుకు వస్తే మన రాష్ట్రం చేపల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: కర్ఫ్యూ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు