రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను తపాలా శాఖ ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 10 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల ప్రసాదాలు పంపిణీ చేసేందుకు తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
దేవుళ్ల ప్రసాదాలు హోం డెలివరీ కావాలనుకున్న భక్తులు.. నేరుగా ఏ పోస్టాఫీసుకైనా వెళ్లి తమకు నచ్చిన గుడిలో ప్రసాదాలకు రుసుం చెల్లించాలని మంత్రి సూచించారు. రెండు, మూడు రోజుల్లో ప్రసాదాలను ఇంటి వద్దకు తెచ్చిస్తారని తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్షా 60 వేల తపాలా కార్యాలయాల ద్వారా ఈ సేవలను పొందవచ్చన్నారు.
ఆలయ పూజ సేవల బుకింగ్లనూ తపాలా శాఖ ద్వారా అందుబాటులోకి తెస్తున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పూజల సేవలను బుక్ చేసుకోలేని వారి కోసం పోస్టాఫీసులో ఆఫ్లైన్ ద్వారా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు.
సేవలు అందుబాటులోకి రానున్న ఆలయాలు..
- యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
- భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం
- వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం
- బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవస్థానం
- కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం
- కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం
- ఉజ్జయిని మహంకాళీ ఆలయం
- సికింద్రాబాద్ గణేశ్ దేవాలయం
- బల్కంపేట ఎల్లమ్మ ఆలయం
- కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం
ఇదీ చూడండి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత