Fake Ice Cream Products in Hyderabad: కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రాజధాని శివారు ప్రాంతాలే కాకుండా నగరం నడిబొడ్డులో కల్తీ దందా నిర్వహిస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నెలల తరబడి మగ్గిన ముడి పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం, రుచి కోసం రసాయనాలను వాడి ఐస్‌క్రీంలు తయారు చేస్తున్నారు. ఏళ్ల తరబడి లైసెన్స్ లేకున్నా బ్రాండ్ పేర్లతో కవర్లలో ఉంచి వినియోగదారులను మోసగిస్తున్నారు.
Fake Ice Cream manufacture in Hyderabad : సైబరాబాద్ పరిధిలోని చందానగర్‌లో ఓ గోదాంలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఐస్‌క్రీంలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆ గోదాంపై దాడి చేసిన మాధాపూర్ ఎస్ఓటీ పోలీసులు.. దాదాపు 10 లక్షల విలువైన ఐస్‌క్రీంలు, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకొని యజమానిని అరెస్టు చేశారు. తాజాగా పేట్ బషీరాబాద్ పరిధిలోని దూలపల్లి, కూకట్‌పల్లిలోని నిబంధనలకు విరుద్ధంగా డెయిరీ కూల్ ఐస్‌క్రీంలు తయారు చేస్తున్న కేంద్రాలపై దాడులు చేసి... 23 లక్షల విలువైన సామగ్రితో పాటు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కేవలం ఐస్‌క్రీంలే కాకుండా చాక్లెట్ల వంటి ఇతర వస్తువులనూ అక్రమార్కులు వదలడం లేదు. ఈ నెల 11న రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో సిట్రిక్ యాసిడ్ పౌడర్, షుగర్ కెమికల్స్‌తో లాలీపాప్స్ తయారు చేస్తున్న ఇస్రార్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిట్రిక్ యాసిడ్ పౌడర్, షుగర్ కెమికల్స్‌తో చాక్లెట్లు, లాలీపాప్స్, పిప్పరమెంట్స్ లాంటి కల్తీ ఉత్పత్తులను తయారు చేసి వాటిని అందంగా ప్యాక్ చేసి బేగంబజార్‌లోని హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు కాటేదాన్ పారిశ్రామిక వాడలోనూ పలు ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.
పిల్లలు తినే పదార్థాలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టండి : ప్రధానంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చాక్లెట్, కుర్‌కురే తయారీ పరిశ్రమలపై దాడులు చేశారు. కల్తీ ఉత్పత్తులను తినటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో వాంతులు, అల్సర్‌తో పాటు నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. పిల్లలు తినే పదార్థాలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏళ్ల తరబడి లైసెన్స్ లేకుండా అక్రమార్కులు కల్తీ వస్తువులు తయారు చేస్తుంటే అధికారులు చూసీ, చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: