Spurious Seeds In Telangana : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ముంగిట విత్తన దందాకు అడ్డుకట్టపడటం లేదు. ఈ ఏడాది వానా కాలం సాగు విస్తీర్ణం కోటి 30 లక్షల ఎకరాలు. తెలంగాణలోకి జూన్ మొదటివారంలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. మరోవైపు ఇప్పటికే పొలాన్ని సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వాతావరణం ఆశాజనంగా ఉంటుందన్న ఆశలతో అనేకమంది పత్తి రైతులు పొలాల్లో విత్తనాలు నాటారు. కాగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రతకు అవి మొలకెత్తడం లేదు. దీంతో మళ్లీ విత్తనాలు నాటేందుకు సిద్ధమౌతున్నారు. మరోవైపు ఈ ఖరీఫ్ సీజన్‌లో పత్తి విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో విత్తనాలకు అమాంతం గిరాకీ పెరిగిపోయింది. దీన్నే ఆసరాగా తీసుకుని కొందరు డీలర్లు, వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
Fake Cotton Seeds Sale In Telangana : నకిలీ విత్తనాల దందా ఏటా కొనసాగుతున్నా ప్రభుత్వం, వ్యవసాయ శాఖల ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు క్షేత్రస్థాయి అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు తెరలేపారు. అధిక ధరలకూ అమ్ముతున్నారు. ఒక విత్తన ప్యాకెట్‌కు 2500 రూపాయలు వసూలు చేస్తుండటం పత్తి రైతులకి ఆందోళన కలిగిస్తోంది. ఇదే అంశంపై ఈ నెల 1 నుంచి వ్యవసాయ శాఖకు 3 వేలపైగా ఫిర్యాదులు అందడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
'గత నాలుగైదు సంవత్సరాలుగా ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80 శాతానికి పైగా పత్తి రైతులే ఉంటున్నారు. వారు ప్రధానంగా చెబుతున్న సమస్య విత్తనం సరిగ్గా మొలకెత్తడం లేదని.. లేదా..రెండు ప్యాకెట్లు వేయాల్సిన చోట నాలుగు ప్యాకెట్లు వేయాల్సి వస్తుందని అంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న ప్రతి కుటుంబం సమస్య ఇదే. ముఖ్యంగా కౌలు రైతులకు మరీ పెద్ద సమస్య.. పెట్టుబడులు పెట్టడమే కాకుండా.. విత్తనాలు కూడా అప్పులు చేసి కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం నుంచి వారికి రైతుబంధు కానీ బ్యాంక్ రుణాలు లాంటి సౌకర్యాలు ఉండవు'. - బన్నూరు కొండల్ రెడ్డి, ప్రతినిధి, రైతు స్వరాజ్య వేదిక
Fake Cotton Seeds In Telangana : వానాకాలం సీజన్‌లో 70 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. ఎకరానికి 2 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు కావాలి. 450 గ్రాములుండే ప్యాకెట్‌ను 853 రూపాయలకు విక్రయించాలని సర్కారు ఆదేశాలు ఇచ్చింది. కానీ, ఊరూపేరూ లేని కంపెనీలు, డీలర్లు, వ్యాపారులు ఏజెంట్ల సాయంతో గ్రామాల్లో తిరుగుతూ వెయ్యి నుంచి 2500 రూపాయల వరకు యథేచ్ఛగా విక్రయిస్తున్నా పట్టించుకున్న నాథుడే కరవయ్యారు.
ఇలానే వరంగల్ జిల్లా కేంద్రంగా నాసిరకం విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న 2 ముఠాలను టాస్క్‌ఫోర్స్ బృందాలు పట్టుకున్నాయి. వీరి నుంచి రూ.2.11 కోట్ల, 7 టన్నుల విడి విత్తనాలు, 9 వేల 765 నాసిరకం విత్తన ప్యాకెట్లు, డీసీఎమ్ వ్యాన్, కారు, రూ.21 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో హెచ్‌టీ పత్తి విత్తనాలు దందా పెద్దఎత్తున కొనసాగుతోంది. హెచ్‌టీ పత్తి విత్తనాలు విత్తి సాగు చేస్తే కలుపు నివారణ కోసం గ్లైఫోసైడ్ మందులు కొట్టాల్సిందే. గ్లైఫోసైడ్ వాడితే పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది...
నకలీ విత్తనాల దందా రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుఅదుపు లేకుండా సాగుతోంది. విత్తనాల దుకాణదారులు నేరుగా దుకాణాల్లో ఈ తంతు నడుపుతున్నా... క్షేత్రస్థాయిలో మండలం వ్యవసాయాధికారి, మండల విస్తరణాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మామూళ్లు అందుతుండటంతో అటువైపు కనీసం కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం, కాలం చెల్లిన పత్తి విత్తనాలు, కంపెనీల విత్తనాలు అధిక రేట్లకు విక్రయిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు.. వ్యవసాయ శాఖకు ఫోన్లు చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నా.. అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోరని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.
'దాదాపు 65 లక్షల పత్తి పంటను మనం పండిస్తున్నాము. దానికి ప్రతిసారి ఏదో ఒక విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సార్లు విత్తనాలు దొరకకపోవడం, కూలీలు దొరకకపోవడం, అన్ని ఉన్నా పంటకు సరిపడా తగ్గ ధర పలకకపోవడం. పోయిన సంవత్సరం పంట రాకముందుకు ధర బాగా పలికింది పంట చేతికి వచ్చిన తర్వాత ధర విపరీతంగా తగ్గింది'. - ఎం.రాజేష్‌కుమార్, గ్రామీణ, వ్యవసాయ రంగ నిపుణులు
Spurious Fake Seeds Sale In Telangana : గ్రామాల్లో పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి, అధికధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై ప్రభుత్వం స్పదించింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బీటీ పత్తి పంట సాగుకు రైతులు ఉపయోగించేది బోల్‌గార్డ్-2 హైబ్రిడ్ విత్తనాలు..అన్ని కంపెనీల పత్తి విత్తనాలు ఒకటే రకమైనవి. ఇవన్నీ ఉత్పత్తి చేసేది ప్రైవేట్ కంపెనీలే. ప్యాకెట్ ఒక్కింటికి కేంద్రప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర 450 గ్రాములు ప్యాకెట్ ధర రూ.853. పత్తి విత్తనాల ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమైనా ధరల నియంత్రణ రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుంది.
కాగా అవసరం కన్నా అధికంగా పత్తి విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని అంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగవుతుందని అంచనా. ఆ మేరకు రైతులకు 58,500 క్వింటాళ్ల పత్తి విత్తనాలు కావాలి. బహిరంగ మార్కెట్‌లో అన్ని కంపెనీల విత్తనాలు కలిపి 77,500 క్వింటాళ్ల వరకు అందుబాటులో ఉన్నందున రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.
డిజిటల్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఇప్పుడు దాదాపు ప్రతిరైతు చేతిలో స్మార్ట్‌ఫోన్ తప్పకుండా ఉంటుంది. ఈ తరుణంలో బీటీ పత్తి విత్తనాలను క్యూఆర్ కోడ్ కింద తీసుకొస్తే స్కాన్ చేయగానే విత్తనోత్పత్తి రైతు పేరు, గ్రామం పేరు, మొబైల్ నంబరు, ఆ విత్తనం, ఏ రకం, తేమ, మొలక శాతం వంటి అంశాలు వచ్చేస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో క్యూఆర్ కోడ్‌పై స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేయంగానే అప్పుడు అది నాణ్యమైంది లేదా నాసిరకం, కాలం చెల్లిన విత్తనం అనేది స్పష్టంగా రైతులకు తెలిసిపోతుంది. ఈ విధానం అందుబాటులోకి తీసుకొస్తే.. నాసిరకం, కాలం చెల్లిన పత్తి విత్తనాల బారినపడి రైతులు నష్ట పోకుండా చూడవచ్చు. ప్రభుత్వం ఈ విధంగా అడుగులేస్తే నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
ఇవీ చదవండి: