Group-3 Exams Started in Telangana : రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ - 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రెండు పేపర్లు, రేపు ఒక పేపర్‌కు పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్-2కు పరీక్ష జరగనుంది. ఎగ్జామ్ రెండు విడతలుగా నిర్వహించనుండగా, ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.
పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులను అధికారులు అనుమతించకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. సికింద్రాబాద్‌లో గ్రూప్-3 పరీక్ష కేంద్రానికి ఇద్దరు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలకు ఐదుగురు అభ్యర్థులు లేట్‌గా వచ్చారు. ఒక నిమిషం ఆలస్యమైందని పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించకపోవడంతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు హాల్ టికెట్ చింపేసి ఓ అభ్యర్థి వెనుదిరిగాడు. పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులు సిబ్బందితో కొంత వాగ్వాదం చేసి చేసేదేమీ లేక వెనుదిరిగారు.
పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెక్షన్ 144 అమలుపరిచారు. గ్రూప్-3 ద్వారా 1,365 పోస్టుల భర్తీ కోసం ఐదు లక్షలా 36 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-3 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,401 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.